Let's talk: editor@tmv.in
ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ టల్లి కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ టల్లి కన్నుమూత

Pinjari Chand
26 జనవరి, 2026

భారత జర్నలిజంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్, రచయిత సర్ మార్క్ టల్లి (90) ఆదివారం న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత వారం రోజులుగా దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మధ్యాహ్నం 2.35 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. స్ట్రోక్‌కు గురైన అనంతరం బహుళ అవయవ వైఫల్యం (మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్) కారణంగానే ఆయన మరణించినట్లు ఆస్పత్రి ప్రకటనలో పేర్కొన్నారు. మార్క్ టల్లి మృతి పట్ల రాజకీయ, మీడియా వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.

భారతదేశపు గొంతు’గా గుర్తింపు

1935లో కోల్‌కతాలో జన్మించిన మార్క్ టల్లి, బీబీసీకి చెందిన ప్రముఖ విదేశీ ప్రతినిధిగా భారత్‌ చరిత్రలోని అనేక కీలక ఘట్టాలను ప్రపంచానికి పరిచయం చేశారు.

1965లో బీబీసీ న్యూఢిల్లీ కార్యాలయంలో ఉద్యోగంలో చేరిన ఆయన, తర్వాత హిందీ సేవలు, పశ్చిమ ఆసియా సేవల విభాగానికి నాయకత్వం వహించారు.

1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1975 ఎమర్జెన్సీ, 1984 ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య, 1991 రాజీవ్ గాంధీ హత్య, ఆర్థిక సంస్కరణలు, 1992 బాబ్రీ మసీదు విధ్వంసం వంటి అనేక చారిత్రక సంఘటనలను ఆయన ప్రత్యక్షంగా కవర్ చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో దేశ బహిష్కరణ

1975లో ఎమర్జెన్సీ సమయంలో సెన్సార్ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించడంతో, మార్క్ టల్లీని 24 గంటల్లోనే దేశం విడిచిపోవాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. ఎమర్జెన్సీ అనంతరం తిరిగి భారత్‌కు వచ్చిన ఆయన, జీవితాంతం న్యూఢిల్లీలోనే నివసించారు.

రచయితగా కూడా విశేష గుర్తింపు

భారత్‌పై ఆయన రాసిన పుస్తకాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా, ఇండియా ఇన్ స్లో మోషన్, ది హార్ట్ ఆఫ్ ఇండియా గౌరవాలు, పురస్కారాలు భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను ప్రదానం చేసింది. 2002లో బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు నైట్ హుడ్ (సర్) బిరుదును కూడా అందించింది. యునెస్కో ‘రేడియో లెజెండ్ ఇన్ ఇండియా’గా మార్క్ టల్లీని కొనియాడింది. భారత ప్రజల హృదయాల్లో ‘బీబీసీ వాయిస్ ఆఫ్ ఇండియా’గా నిలిచిన మార్క్ టల్లి మృతి జర్నలిజం రంగానికి తీరని లోటు అని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

ప్రముఖ జర్నలిస్ట్ మార్క్ టల్లి కన్నుమూత - Tholi Paluku