Let's talk: editor@tmv.in
ప్రమాదకరంగా ఫ్లైఓవర్ పనులు: ప్రాణాలకు తెగించి విధుల్లో కార్మికులు

ప్రమాదకరంగా ఫ్లైఓవర్ పనులు: ప్రాణాలకు తెగించి విధుల్లో కార్మికులు

Gaddamidi Naveen
3 మార్చి, 2026

హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పరిధిలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇప్పుడు వాహనదారులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చంచల్‌గూడ - సంతోష్ నగర్ మధ్య నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ వద్ద ఎటువంటి రక్షణ చర్యలు లేకుండానే భారీ బీములను, క్రేన్లతో పైకి లేపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రాఫిక్ మధ్యే భారీ నిర్మాణాలు

సుమారు 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైంది. ప్రస్తుతం 82 శాతం పనులు పూర్తయిన ఈ నిర్మాణ ప్రాంతంలో, కింద వాహనాలు రద్దీగా వెళ్తుండగానే పైన భారీ ఇనుప కమ్మీలను, సిమెంట్ బీములను అమరుస్తున్నారు. కార్మికులు ఎటువంటి సేఫ్టీ బెల్టులు లేదా రక్షణ కవచాలు లేకుండా గాలిలో వేలాడుతూ పనులు చేస్తున్నారు. గతంలో ముంబై, బీహార్‌లలో జరిగిన ఫ్లైఓవర్ ప్రమాదాలను గుర్తుచేసుకుంటూ వాహనదారులు వణికిపోతున్నారు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మౌనంలో అధికారులు

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, పని జరుగుతున్న సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించకపోవడం లేదా రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అటు జీహెచ్ఎంసీ గానీ, ఇటు హైడ్రా అధికారులు గానీ ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. తక్షణమే భద్రతా ఆడిట్ నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

ప్రమాదకరంగా ఫ్లైఓవర్ పనులు: ప్రాణాలకు తెగించి విధుల్లో కార్మికులు - Tholi Paluku