
ప్రమాదంలో హిమాలయాలు
హిమాలయాలు సైలెంట్‌గా కనిపిస్తున్నాయ్ కానీ వాటి లోతుల్లో ఒక అస్థిరత మెల్లగా కదులుతోంది. మంచు పర్వతాలు శ్వాస తీసుకుంటున్నట్లు అనిపించినా ఆ శ్వాసలో ఇప్పుడు వేడి ఉంది. ఒకప్పుడు చల్లదనానికి ప్రతీకగా నిలిచిన ఈ శ్రేణులు ఇప్పుడు వేడెక్కిన గుండెలుగా మారుతున్నాయి. వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి, మేఘాలు ఒక్కసారిగా చెలరేగి గ్రామాలను కొట్టుకుపోతున్నాయి, గ్లేసియర్లు కరిగి నదులను ఉప్పొంగుతున్నాయి. భూమి పైకప్పు అని పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రమాదాల గూడు అవుతోంది. ప్రతి శిఖరం తన తాలూకు భారాన్ని తట్టుకోలేక కదులుతోంది, ప్రతి లోయ ఒక కొత్త విపత్తును తీసుకొస్తోంది. ఈ మౌనమైన పర్వతాల మధ్య ఇప్పుడు మనిషి అడుగులు మరింత వేగంగా పెరిగాయి. రోడ్లు, సొరంగాలు, పట్టణాలు, గృహాలు లాంటివి పర్వతాల గుండెలో తవ్వుకుంటూ ఉన్నాయి. ప్రకృతి మన నిర్మాణాన్ని తట్టుకోలేక చీలిపోతోంది. ఆ చీలికల్లో నుంచి మేఘాలు పెల్లుబికుతున్నాయి.. నీరు ఉధృతంగా పరిగెడుతోంది, రాళ్లు కూలిపోతున్నాయి.
ఈ ప్రమాదాలు ప్రకృతివల్లే కాదు. మనిషి కూడా దీనికి కారణం. పర్వతాల పొట్టలో రోడ్లు తవ్వడం, సొరంగాలు కట్టడం, భవనాలు నిర్మించడం ప్రకృతి సమతౌల్యాన్ని భంగం చేసింది. ఒకప్పుడు కేవలం మట్టిరోడ్లు ఉన్న ప్రదేశాల్లో ఇప్పుడు భారీ రహదారులు విస్తరించాయి. ఉత్తరాఖండ్‌లోనే 2003లో వెయ్యి కిలోమీటర్ల రహదారి ఉండగా 2024 నాటికి అది 3,600కిలోమీటర్లకు పెరిగింది. ఇది అభివృద్ధి అయినా అదే సమయంలో పర్వతాల స్థిరత్వాన్ని దెబ్బతీసింది. నేలలోని నీటి మార్గాలు మారాయి, వర్షపు నీరు ఎక్కడా నిలవక అకస్మాత్తుగా దిగువకు జారిపోతోంది. అందుకే ఒక్క వర్షం పడితేనే కొండచరియలు కూలిపోతున్నాయి, గ్రామాలు మునిగిపోతున్నాయి.
ఉత్తరాఖండ్‌లో ధరాలి అనే గ్రామం ఒకప్పుడు పచ్చదనంతో కప్పబడి ఉండేది. కానీ గత వర్షాకాలంలో అక్కడ సంభవించిన క్లౌడ్ బరస్ట్ ఆ గ్రామాన్ని పూర్తిగా కొట్టుకుపోయేలా చేసింది. 2023లో సిక్కింలో గ్లేసియర్ సరస్సు పగిలి వచ్చిన వరద హైడ్రోపవర్ ప్రాజెక్టును నేలమట్టం చేసింది. కశ్మీర్‌లో కొండచరియలు కూలి యాత్ర మార్గాలను మూసేశాయి. ఈ ఘటనలు ఒక్కొక్కటిగా మనకు హెచ్చరికలు. ఇవి కేవలం వార్తలు కాదు, హిమాలయాల శ్వాసలోని మార్పు. ప్రతి విపత్తు తర్వాత కొంత నేల అదృశ్యమవుతోంది, కొంత ఆశ దెబ్బతింటోంది.
ఇలాంటి సమయంలో ఓ కొత్త నివేదిక ఒక దిశను చూపించింది. హిమాలయ ప్రాంతానికి బహు ప్రమాదాల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఉండాలని నివేదిక చెబుతోంది. దీని ఉద్దేశ్యం వేర్వేరు విభాగాల్లో జరిగే విపత్తు నిర్వహణను ఒకే వ్యవస్థగా మలచడం..! అంటే ప్రతి గ్రామానికి, ప్రతి లోయకు ఒక ముందస్తు హెచ్చరిక ఉండాలి. వర్షం కురిసే ముందే సమాచారం చేరాలి, నేల తడిగా మారే సరికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యవస్థకు తక్కువ ఖర్చుతో పనిచేసే రెయిన్ గేజ్‌లతో పాటు సరస్సుల నీటి మట్టం కొలిచే పరికరాలు అవసరం. ఈ పరికరాల ద్వారా వచ్చే సమాచారం మొబైల్ అలర్ట్‌ల రూపంలో గ్రామస్తులకు చేరితే ప్రాణాలు కాపాడవచ్చు. ఇది కేవలం సాంకేతిక పరిష్కారం కాదు, సామాజిక భద్రతా వలయం.
ఇతర దేశాలు ఇప్పటికే ఈ మార్గంలో నడిచాయి. జపాన్ తరచుగా తుఫాన్లు, భూకంపాలు, వర్షపాతం కారణంగా విపత్తులను ఎదుర్కొంటుంది. అక్కడ దేశవ్యాప్తంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థ పనిచేస్తోంది. వర్షం తీవ్రత పెరిగినప్పుడల్లా స్థానిక ప్రభుత్వాలకు సమాచారం చేరుతుంది, వారు వెంటనే ప్రజలకు హెచ్చరికలు పంపుతారు. స్విట్జర్లాండ్ మంచు పర్వతాల దేశం. అక్కడ ప్రతి పర్వతానికి సెన్సర్లు అమర్చబడ్డాయి, మంచు కదలికలు గమనిస్తాయి. నార్వేలో వర్షపాతం ఎక్కువగా ఉండటంతో అక్కడి నీటి వనరుల శాఖ వరదల గురించి ముందే సమాచారం ఇస్తుంది. భూటాన్‌లో గ్లేసియర్ సరస్సుల వద్ద నీటి మట్టం తగ్గించేందుకు ప్రత్యేక నాళాలు నిర్మించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ దేశాల అనుభవాలు చూపిస్తున్నాయి.. సాంకేతికత, పాలన, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఎంతటి పర్వత ప్రాంతమైనా సురక్షితంగా మారవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ మన భవిష్యత్తుకు ప్రాణాధారం కావాలి. హిమాలయాలు ఇంకా మనకు చెబుతున్నాయి.. నన్ను వినండి, నన్ను రక్షించండి, లేకపోతే నేను కరిగిపోతాననని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయ్. మరి చూడాలి మనిషి ఏం చేస్తాడో.. ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వెయిట్ అండ్ సీ!
