
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: కొల్లు రవీంద్ర
రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ప్రజా క్షేత్రంలోకి ‘సూపర్-6’ పథకాలు
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్-6’ హామీలు, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లస్టర్ ఇంచార్జీలపై ఉందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించాలని సూచించారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని నిజాలను ప్రజలకు వివరించి అప్రమత్తం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం
ఇక నియోజకవర్గ మౌలిక వసతులపై స్పందిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా టౌన్, రూరల్ అనుబంధ సంఘాల నియామకాలు, కేఎస్‌ఎస్‌ల ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు కోనకళ్ళ జగన్నాథరావు పాల్గొని మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. కాగా ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి గోపు సత్యనారాయణ, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, కార్పొరేటర్లు మర కాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత, దింతకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్, చిత్తజల్లు నాగరాముతో పాటు పలువురు క్లస్టర్ ఇంచార్జీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
