
ప్రభుత్వ విఫలంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలందరూ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించాలని హరీష్ రావు పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందాలంటే కాంగ్రెస్,బీజేపీ ఇచ్చిన హామీలను వాళ్లు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను, అమలుకాని పథకాల గురించి ప్రజలకు తెలుపాలని కోరారు.
సమావేశ అనంతరం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు వచ్చి ప్రజలు ఇల్లు, పొలాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ..“ఇది పార్టీకి ఓటేసినందుకు కాదు, ఇది మానవతా ధర్మంగా చేస్తున్న పరామర్శ. ప్రజల బాధలో అండగా ఉండడం బీఆర్ఎస్ పార్టీ ధ్యేయం” అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని, సహాయక చర్యలు ఆలస్యం కావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మోడీ దేశం కోసం ధర్మం కోసం అంటాడు.. దేశంలో తెలంగాణ భాగం కాదా? మరి తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు.ఎప్పుడు మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ కేవలం నార్త్ ఇండియానే పట్టించుకుంటున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. వరదల వల్ల కూలిపోయిన ఇల్లు, నష్టం చెందిన పంటలు, నశించిన దినసరి వస్తువుల విషయాల్లో ప్రజల వైపు ప్రభుత్వం చూడడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దుస్థితిని పట్టించుకోవడం లేదని, వారి బాధలు విని వెంటనే సహాయం అందించాల్సిన బాధ్యత మీకు లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కావలసింది మాటలు కాదు,చర్యలు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, బీఆర్ఎస్ పార్టీ తమవంతు బాధ్యతగా ముందుకు వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. అలాగే వినోద్ కుమార్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో వరదలతో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని.వందలాది ఇండ్లు కూలిపోయాయని,ప్రాణ నష్టం,ఆస్తి నష్టం ఎక్కువ జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా కామారెడ్డికి వచ్చి అందరిని ఆదుకుంటామని భారోసా ఇచ్చి నెలరోజులు పూర్తయిందని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా నష్టం అంచనా వేసి న్యాయం చేయాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ నాగిరెడ్డిపేట మండల ప్రజలు నష్టాన్ని త్వరగా తట్టుకోలేము, ప్రభుత్వం తరపున పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు.ఇప్పుటి వరకు వరద బాధితులకు నయాపైసా సహాయం అందలేదని తెలిపారు.
