
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ 'పోరు'బాట
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ ) విధానంలో నడపాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పేదల వైద్య విద్య, ఆరోగ్య హక్కులను కాలరాసే జీవో 590ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు..
మంత్రులు, కీలక నేతల నేతృత్వంలో భారీ ర్యాలీలు
పుత్తూరులో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జీవో 590ని రద్దు చేయకపోతే తమ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. పేద విద్యార్థులు వైద్య విద్య అందుకోలేని పరిస్థితికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేస్తూ, గతంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించలేదని ఆమె విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిందని, కొత్త ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని ఆమె వివరించారు.
చిత్తూరులో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ విజయానంద్‌రెడ్డి నేతృత్వంలో, పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. నాయకులు ప్రభుత్వ ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వ ఆస్తులను, విద్యా సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం బినామీలకు అప్పగించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.
ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన నిరసనలోనూ భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొన్నారు. పీపీపీ విధానం వల్ల పేదల విద్య, వైద్య సేవలు నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన 17 కాలేజీల్లో ఏడింటి నిర్మాణం పూర్తయి, ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.
వేల సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదం
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఇప్పటికే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయామని రాబోయే విద్యాసంవత్సరాల్లో మరో 2,450 సీట్లు నష్టపోయే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాలేజీల ద్వారా నిరుద్యోగ యువతకు లభించే ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయని వారు స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అపూర్వ స్పందన
చోడవరం, కమలాపురం నియోజకవర్గాల్లోనూ నిరసనలు ఉధృతంగా సాగాయి. చోడవరం పట్టణంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో జరిగిన ర్యాలీకి ప్రతి గ్రామం నుంచి మహిళలు, యువత ఉత్సాహంగా హాజరయ్యారు. "ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకూడదు" అనే నినాదాలు మార్మోగాయి.
కమలాపురంలో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా ప్రజలు, విద్యార్థులు పాల్గొని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. పేద విద్యార్థుల సంక్షేమాన్ని పక్కన పెట్టి, కార్పొరేట్ ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు.
ప్రజా ఆరోగ్య హక్కుల పరిరక్షణ, పేద విద్యార్థుల సంక్షేమం కోసం తమ పోరాటం మరింత ఉత్సాహంతో కొనసాగుతుందని ప్రభుత్వం తక్షణమే జీవో 590ను రద్దు చేసి కాలేజీల నిర్మాణ బాధ్యతను స్వయంగా తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
