
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు: మంత్రి జి. వివేక్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో శ్రమిస్తే దేశంలోనే అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'స్యూరిఫై స్కూల్ కిట్స్' ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేడు ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయని, గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు సైతం ఐఐటీ, వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రవేశాలు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. చేగుంట ప్రభుత్వ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం ఇక్కడి ఉపాధ్యాయుల నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలని, అది దాతృత్వం కాదు.. సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. తన తండ్రి దివంగత జి. వెంకటస్వామి స్ఫూర్తితోనే తాను వ్యాపారంలో రాణించిన తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎన్నో ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచానని గుర్తుచేశారు. విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్న సంకల్ప్ ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో ఉద్యోగ మార్కెట్ మారుతోందని, అందుకే యువతకు ఆధునిక నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం 'ఏటీసీ'లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. టామ్‌కామ్ దీని ద్వారా విదేశీ భాషా శిక్షణ ఇచ్చి, దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. చేగుంట ప్రజల దశాబ్దాల నాటి డిమాండ్ అయిన 'ప్రభుత్వ డిగ్రీ కళాశాల' ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఖచ్చితంగా మంజూరయ్యేలా కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
