Let's talk: editor@tmv.in
ప్రభుత్వ పాఠశాలల బ్రేక్‌ఫాస్ట్ పథకానికి దివీస్, అరబిందో నుంచి రూ.22.18 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు

ప్రభుత్వ పాఠశాలల బ్రేక్‌ఫాస్ట్ పథకానికి దివీస్, అరబిందో నుంచి రూ.22.18 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు

Gaddamidi Naveen
25 జులై, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల రూపంలో దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా సంస్థలు మొత్తం రూ.22.18 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు ఈ చెక్కులను అందజేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకం కోసం దివీస్ లేబొరేటరీస్ రూ.12.18 కోట్ల సీఎస్‌ఆర్ నిధులను అందించగా, అరబిందో ఫార్మా రూ.10 కోట్ల చెక్కును ఫౌండేషన్‌కు అందించింది. ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు, దివీస్, అరబిందో ఫార్మా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి పథకం అమలు తీరును వివరించారు.

ప్రస్తుతం హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి తోడ్పడే ఈ కార్యక్రమానికి సీఎస్‌ఆర్ నిధులను అందించిన దివీస్, అరబిందో సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హరే కృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ల పరిసర ప్రాంతాల్లోని రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కూరగాయలు, బియ్యం, ఇతర అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసే విధానాన్ని ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. అలాగే రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించడం, నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.