Let's talk: editor@tmv.in
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పులివర్తి నాని

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పులివర్తి నాని

Panthagani Anusha
24 మార్చి, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. సోమవారం చంద్రగిరి మండలం పనపాకం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రోజువారీ మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా లేదా అన్న విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఆయన, తాను తిన్న ప్లేటును స్వయంగా శుభ్రం చేయడం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.

పాఠశాల వంటశాల నిర్వహణ, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి హాజరు పట్టికను తనిఖీ చేశారు. కేంద్రం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే చిన్నపిల్లలకు, గర్భిణీలకు అందే పోషకాహార పంపిణీలో ఎటువంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.