Let's talk: editor@tmv.in
ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు

Gaddamidi Naveen
8 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం వికారాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు పలు పాఠశాలలను సందర్శించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

వికారాబాద్: గురుకుల పాఠశాలలో హెల్త్ క్యాంప్

'99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక'లో భాగంగా వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ పరిగి మండలం తుంకులగడ్డలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చిగురల్పల్లి, గోవిందాపూర్ గ్రామాలను కూడా ఆయన పరిశీలించారు. గురుకులంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించాలని సూచించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సీపీఆర్ పై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలలోని భోజనశాల, వంటగది, స్టోర్ రూమ్‌లను ఆయన తనిఖీ చేశారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్: పారిశుధ్యమే ప్రాధాన్యం

ఇక కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత దహేగావ్ మండలంలోని ఐనమ్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను వారానికి కనీసం ఒకసారి గ్రామపంచాయతీ కార్మికులు శుభ్రం చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్త బుట్టల్లోనే వేయాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని తెలిపారు.

జనగామ: నాణ్యమైన విద్యే భవిష్యత్తుకు పునాది

జగిత్యాల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చౌదారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించి పాఠశాల సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల వసతి, ఆహార ఏర్పాట్లు, పరిశుభ్రత పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని కృషి చేయాలని సూచిస్తూ, నాణ్యమైన విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు.ఈ తనిఖీలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వ బాధ్యతను చాటుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు - Tholi Paluku