
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహారమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
చారిత్రాత్మక నేపథ్యం కలిగిన రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూసంస్కరణల పితామహుడు, మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చదువుకున్న ఈ పాఠశాల తెలంగాణ చరిత్రలోనే గర్వకారణమని కొనియాడారు.
శతాబ్దన్నర చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థ రాష్ట్ర విద్యా రంగానికి చేసిన సేవలు అమోఘమని కొనియాడారు.ప్రజా ప్రభుత్వంగా విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ సంకల్పమని ఆయన తెలిపారు.
కామన్ స్కూల్ విధానం అమలుతోనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుందని, కుల, మత, పేద, ధనిక భేదాలు లేని సమానత్వ భావన చిన్ననాటి నుంచే పిల్లల్లో పెంపొందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ దిశగా ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఒక్కోటి రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్ తెలంగాణకు బలమైన మానవ వనరులే పునాదని పేర్కొన్న డిప్యూటీ సీఎం, అందుకే ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతున్నాయని అన్నారు.
