Let's talk: editor@tmv.in
ప్రభుత్వ నిర్ణయం సరైనదే... ఏకసభ్య కమిటీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు

ప్రభుత్వ నిర్ణయం సరైనదే... ఏకసభ్య కమిటీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు

Panthagani Anusha
24 ఫిబ్రవరి, 2026

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కల్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కమిటీ నియామకాన్ని సవాలు చేస్తూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం సోమవారం నిరాకరించింది. సీబీఐ పర్యవేక్షణలోని ‘సిట్’ఇప్పటికే తన నివేదికను సమర్పించినందున రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో పరిపాలనాపరమైన చర్యల కోసం కమిటీని ఏర్పాటు చేసుకోవడం చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది.

పరిపాలనాపరమైన చర్యలకే ప్రాధాన్యం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిపాలనాపరమైన లోపాలను విచారించడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే సిట్ దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన తరుణంలో, ఈ కొత్త కమిటీ నియమించడం వల్ల దర్యాప్తు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి స్వామి వాదనలతో విభేదించింది.

ఓవర్ లాపింగ్ లేదు

సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిపాలనాపరమైన విచారణకు, సిట్ చేపట్టిన నేరపూరిత విచారణకు ఎక్కడా పొంతన లేదని రెండూ వేర్వేరు మార్గాల్లో సాగుతాయని కోర్టు అభిప్రాయపడింది. సిట్ తన దర్యాప్తు ముగించి ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేసినందున భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాలనాపరమైన సంస్కరణలు చూపించే హక్కు ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అభ్యంతరాలలో పస లేదని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది: విజయ్ కుమార్

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పేర్కొంటూ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా మరోసారి ధృవీకరించింది అని పేర్కొన్నారు. "సిట్ సమర్పించిన ‘సెల్ఫ్-కంటైన్డ్ నోట్స్’ ఆధారంగా పదవీ విరమణ చేసిన కొందరు సీనియర్ అధికారుల బాధ్యతను కూడా ఈ ఏకసభ్య కమిటీ నిగ్గు తేలుస్తుంది. ఇది కేవలం పరిపాలనాపరమైన సంస్కరణల కోసమే తప్ప దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి కాదని" ఆయన స్పష్టం చేశారు.

మొత్తమ్మీద సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దినేష్ కుమార్ కమిటీ తన నివేదికను వేగవంతం చేసే అవకాశం ఉంది. లడ్డూ నెయ్యి టెండర్లలో నిబంధనల ఉల్లంఘన, నాణ్యత పరీక్షల్లో నిర్లక్ష్యం వహించిన అధికారుల జాబితాను ఈ కమిటీ రూపొందించనుంది. దీని ఆధారంగా బాధ్యులైన ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

ప్రభుత్వ నిర్ణయం సరైనదే... ఏకసభ్య కమిటీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు - Tholi Paluku