
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే మా ప్రాధాన్యత: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ బకాయిలను త్వరగా క్లియర్ చేయడానికి ప్రస్తుతం ప్రతి నెల చెల్లిస్తున్న రూ.700 కోట్లను రూ.1,000 కోట్లకు పెంచే విధాన నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు నెలలో 15వ తేదీ దాటిన తర్వాతే జీతాలు అందేవని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే ప్రతి నెలా 1వ తేదీనే ఖచ్చితంగా జీతాలు జమ చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇది ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రూ.4,575 కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని, మొత్తం మీద రూ.40,150 కోట్ల అప్పులను వదిలివెళ్లిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నెలకు రూ.700 కోట్ల చొప్పున ఈ బకాయిలను తీరుస్తోంది. దీనిని మరింత వేగవంతం చేసేందుకు, నెలవారీ చెల్లింపును రూ.1,000 కోట్లకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఉద్యోగులకు సంబంధించి సుమారు రూ.6,146 కోట్ల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇందులో మూడు పెండింగ్ డీఏలు, మెడికల్ బిల్లులు ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కేబినెట్ ఉద్యోగుల కోసం నగదు రహిత వైద్య సేవల కార్డులను ప్రవేశపెడుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. గత పదేళ్లుగా ఉద్యోగ సంఘాలు కోరుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అలాగే, విధి నిర్వహణలో లేదా ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.1.25 కోట్ల ప్రమాద బీమా అందించే పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
రిటైర్మెంట్ సవాళ్లు - పీఆర్సీ
గత ప్రభుత్వం పదవీ విరమణ ప్రయోజనాల భారం తప్పించుకోవడానికి రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచిందని, దీనివల్ల ఇప్పుడు 17,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడిందని ఆయన వివరించారు. కొత్త పీఆర్సీ నివేదిక అందిన వెంటనే అమలుపై నిర్ణయం తీసుకుంటామని, అలాగే మిగిలిన నాలుగు డీఏలపై కూడా సానుకూల నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు.
గతంలో ఉద్యోగులపై ఉన్న ఆంక్షలను తొలగించి, ఉద్యోగ సంఘాల నేతలు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని లేదా మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పుకునే పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వం మధ్య సమన్వయం పెరిగిందని, తద్వారా వ్యవస్థలను మళ్లీ బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఐదవ రోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 30-40 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించిన ఉద్యోగులకు అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు, బకాయిల చెల్లింపులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు.
రిటైర్డ్ ఉద్యోగులు తమ సొంత డబ్బుల కోసం ధర్నాలు చేయాల్సి రావడం సిగ్గుచేటని, ప్రభుత్వ తీరుతో వారిలో అభద్రతా భావం ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ (పాత పెన్షన్ విధానం) తెస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. దాదాపు రూ. 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, నెలకు రూ. 700 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కోర్టుల చుట్టూ తిరిగితేనే నిధులు వచ్చే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందులతో ఖమ్మం జిల్లాకు చెందిన మైసయ్య వంటి సుమారు 30 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని సభ దృష్టికి తెచ్చారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు తక్షణమే భరోసా కల్పిస్తూ, బకాయిల చెల్లింపుపై స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని వివేకానంద్ డిమాండ్ చేశారు.
