
ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు సంపూర్ణ నగదు రహిత వైద్యం: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి భయాందోళనలు లేని ఆరోగ్య భద్రతను కల్పించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నూతన ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్)ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి ఆయన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై వైద్య ఖర్చుల కోసం అప్పులపాలవుతున్న ఉద్యోగుల దుస్థితిని గమనించి, వారికి సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించడానికే ఇందిరమ్మ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన 29.80 లక్షల మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 886 ప్రైవేట్ నెట్‌వర్క్, 114 ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉద్యోగులు పూర్తిస్థాయి నగదు రహిత ఇన్‌పేషెంట్ వైద్య సేవలను పొందవచ్చని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ప్యాకేజీలకు అనుగుణంగా 1,816 రకాల వైద్య, శస్త్రచికిత్సలను ఈ పథకం కవర్ చేస్తుందని వివరించారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పథకం అమలు, పర్యవేక్షణ కోసం ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రూ. 10 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల విజ్ఞప్తులను పదేళ్ల పాటు బుట్టదాఖలు చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. గత పాలకులు పెండింగ్‌లో పెట్టిన దాదాపు రూ. 10 వేల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం మానవీయ కోణంలో క్లియర్ చేస్తోందని వెల్లడించారు. నెలకు రూ. 2,000 కోట్ల చొప్పున బకాయిలు విడుదల చేస్తున్నాం. ప్రతి 15 రోజులకోసారి నేనే స్వయంగా సమీక్షిస్తూ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా చూస్తున్నాను అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ (ఛైర్మన్ భట్టి విక్రమార్క, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క) సుదీర్ఘంగా చర్చించి ఈ పకడ్బందీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుందని డిప్యూటీ సీఎం వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతతో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని భట్టి గుర్తుచేశారు. ప్రభుత్వం ఇంతటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నందున, ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరి డా. క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
