Let's talk: editor@tmv.in
ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా పోస్టుల భర్తీ: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా పోస్టుల భర్తీ: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Gaddamidi Naveen
24 మార్చి, 2026

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది పోస్టులను యుద్ధప్రతిపాదికన భర్తీ చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, గడిచిన రెండేళ్లలో దాదాపు 10 వేల పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేల పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చివరి దశలో ఉందని ఆయన వివరించారు.

రాష్ట్రంలో భారీ సంఖ్యలో మెడికల్ కాలేజీలు పెరగడంతో డాక్టర్ల కొరత ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అవసరమైన అర్హత కలిగిన అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు తక్కువగా ఉండడం వల్ల ఆయా పోస్టుల భర్తీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెడికల్ కాలేజీల్లో 1200 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసినట్లు తెలిపారు. అలాగే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో 1616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ జరుగుతోందని, ఇవి కూడా మరో నెలలో పూర్తవుతాయని వెల్లడించారు. ఇప్పటికే 7 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, మరో 2312 పోస్టుల నియామకాన్ని ఏప్రిల్‌లో పూర్తి చేయనుంది. అంతేకాక గత రెండేళ్లలో 1500కు పైగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కూడా భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు.

మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి సూచన

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని జనరిక్ మందుల షాపులను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని, పేదలకు భారంగా మారిన మందుల ధరలను వెంటనే నియంత్రించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శాసనమండలి ఛైర్మన్ సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేటు మెడికల్ షాపుల విషయంలో కొత్త అనుమతులు ఇవ్వలేదని, ఇప్పటికే ఉన్న వాటిని కూడా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని షాపులు కోర్టు స్టే ఆర్డర్లతో కొనసాగుతున్నాయని, కోర్టు అనుమతి వచ్చిన వెంటనే వాటిని తొలగిస్తామని తెలిపారు. ప్రజలకు తక్కువ ధరలో మందులు అందుబాటులో ఉండేందుకు జనరిక్ మెడికల్ షాపులను ప్రోత్సహిస్తామని మంత్రి పేర్కొన్నారు.