Let's talk: editor@tmv.in
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు: సీఎం స్టాలిన్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు: సీఎం స్టాలిన్

Pinjari Chand
25 జనవరి, 2026

తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. శనివారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, గవర్నర్ ప్రవర్తన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ద్రవిడియన్ మోడల్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని స్టాలిన్ స్పష్టం చేశారు. సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాల కారణంగా తమిళనాడు మరింత అభివృద్ధి సాధించింది. ఒక విజయాన్ని సాధించిన వెంటనే మరొక పెద్ద విజయాన్ని నమోదు చేయడం ద్రవిడియన్ మోడల్ ప్రభుత్వ ప్రత్యేకత అని ఆయన అన్నారు.

గవర్నర్ ఆర్‌ఎన్ రవి తరచూ ఒకే కారణాన్ని చూపిస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని సీఎం విమర్శించారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దేశం, జాతీయ గీతంపై మాకు అపారమైన గౌరవం ఉంది. దేశభక్తిపై మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో సంప్రదాయంగా ప్రారంభంలో తమిళ్ తాయ్ వాజ్తు, ముగింపులో జాతీయ గీతం ఆలపించడం ఆనవాయితీ అని గుర్తు చేసిన ఆయన, ఈ విషయాన్ని గవర్నర్ అర్థం చేసుకోవాలని అన్నారు. తన మొదటి పాలన కాలాన్ని గుర్తు చేసుకున్న సీఎం, అధికారంలోకి వచ్చినప్పుడు ఆనందంతో పాటు బాధ్యతలపై ఆందోళన కూడా ఉందని చెప్పారు. ఐదేళ్ల పాలన అనంతరం ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే తాను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చిందని అన్నారు.

అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం

ప్రభుత్వ ప్రధాన పథకాలుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ‘విడియల్ పయనం’, కలైంగర్ మహిళా హక్కు భృతి, రూ.3,000 పొంగల్ సహాయం, హామీ పింఛన్ పథకం, 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీని స్టాలిన్ ప్రస్తావించారు. అలాగే కలైంగర్ శతాబ్ది గ్రంథాలయం, కిళంబాక్కం బస్ టెర్మినల్, రోడ్ల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌లు, తాగునీటి పథకాల వంటి మౌలిక వసతుల పనులను వివరించారు. రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.34 లక్షల కోట్ల రుణాలు అందించామని చెప్పారు. దేవాలయాలకు సంబంధించిన రూ.8,000 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి రూ.500 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు: సీఎం స్టాలిన్ - Tholi Paluku