Let's talk: editor@tmv.in
ప్రభుత్వానికి, ప్రైవేట్ ఆసుపత్రులకు మధ్య కుదరని సయోధ్య

ప్రభుత్వానికి, ప్రైవేట్ ఆసుపత్రులకు మధ్య కుదరని సయోధ్య

Dantu Vijaya Lakshmi Prasanna
24 అక్టోబర్, 2025

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య ఉన్న వివాదం రోజురోజుకూ ముదురుతుంది.

ప్రభుత్వ చర్య:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం (అక్టోబర్ 22) డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలలో కొంత భాగాన్ని ₹250 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ,ఆర్థిక శాఖ మంత్రి పి. కేశవ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో ₹250 కోట్లను కూడా త్వరలో విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఈ పథకం కింద ఆరోగ్య సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం, ఇతర సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ప్రైవేట్ ఆసుపత్రుల స్పందన :ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వం చేసిన ₹250 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించింది. సంఘం అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ విధమైన "చిన్న మొత్తాలను" అంగీకరించడం వారి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేస్తుందని ,"మా నగదు ప్రవాహానికి , మా వృత్తిపరమైన భవిష్యత్తుకు ముగింపు పలుకుతుందని" పేర్కొన్నారు. పూర్తి చెల్లింపు కోసం ఆసుపత్రులు పట్టుబడుతున్నాయని సూచిస్తూ, ఈ విషయం లో అందరూ "ఐక్యంగా ఉండాలని, పుకార్లకు, తప్పుడు ఆశలకు లోనుకావద్దని" కె. విజయ్ కుమార్ సంఘ సభ్యులను కోరారు.

వివాదానికి నేపథ్యం

ప్రైవేట్ ఆసుపత్రులు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రజలకు ఉచిత (క్యాష్‌లెస్) ఆరోగ్య సంరక్షణ అందిస్తున్నాయి. అయితే, ఈ సేవలకు సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆసుపత్రులకు చెల్లింపులలో జాప్యం జరుగుతుంది.

• ప్రభుత్వ నివేదికల ప్రకారం రావాల్సిన మొత్తం బకాయిలు 2025 నాటికి ప్రకారం దాదాపు ₹2,700 కోట్లుగా ఉంది.

• పెరుగుతున్న ఈ బకాయిల కారణంగా ఆసుపత్రులు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

• ఈ సమస్యకు నిరసనగా ఆసుపత్రులు ఇప్పటికే అక్టోబర్ 10 నుండి ఈ పథకం కింద సేవలను నిలిపివేశాయి.

• ప్రభుత్వం విడుదల చేసిన ₹250 కోట్లు మొత్తం బకాయిల్లో అతి చిన్న భాగం కావడంతో, ఆసుపత్రులు దీనిని తిరస్కరించి, పూర్తి చెల్లింపు కోసం తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.

పెరుగుతున్న ఈ బకాయిలను చెల్లించకపోవడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ సమస్యలు ఎదురవుతున్నందున, ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే ఈ పథకం కింద తమ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి .అక్టోబర్ 10 నుండి ఈ సేవలు నిలిపి వేశారు కూడా. ప్రభుత్వం విడుదల చేసిన ₹250 కోట్లు, మొత్తం బకాయిలలో ఒక చిన్న భాగం మాత్రమే, అందుకే ఆసుపత్రులు వెంటనే ఈ ఆఫర్‌ను తిరస్కరించి, తమ నిరసన/సేవల నిలుపుదలను కొనసాగిస్తున్నాయి.

చెల్లింపుల క్లియరెన్స్

ఈ పథక ప్రయోజనదారులకు ఆస్పత్రులు ఇచ్చిన చికిత్సల బిల్లుల ఆధారంగా 2024 జూన్ నుండి 2025 సెప్టెంబర్ 1వరకు సుమారు రూ. 6,458 కోట్లు ఖర్చైనట్లు తెలుస్తుంది. అందులో రూ. 3,732 కోట్లు చెల్లించబడ్డాయి, ఇంకా రూ. 557 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వం వదలిన రూ. 2,221 కోట్ల పెండింగ్‌ను ఈ కొత్త ప్రభుత్వం క్లియర్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక కుటుంబానికి రూ. 25 లక్షల వరకు హెల్త్ కవరేజ్ ఉండబోతోంది అని ప్రకటించింది .మొత్తం 3,257 రకాల వైద్య విధానాలు ఈ పథక పరిధిలో చేర్చబడ్డాయి. పేదవర్గాలు మాత్రమే కాక, మధ్యతరగతి కుటుంబాలకి కూడ ఈ పధకం వర్తింప చెయ్యాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది .

ఆస్పత్రులకు ముందస్తు అనుమతి సమయం 24 గంటల నుండి 6 గంటల వరకు తగ్గించే ప్రయత్నం జరిగింది. హెల్త్ కార్డ్ లేకపోయినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లవచ్చు అనే మార్గాన్ని కూడా జిల్లా/రాష్ట్ర అధికారులు ఆమోదించారు. ముఖ్యంగా “కార్డ్ లేనివారికి ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి” ద్వారా చికిత్స పొందే అవకాశాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రులు అనవసరంగా ప్రయోజనదారుల నుంచి చెల్లింపు తీసుకొంటున్నట్లయితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

ఇతర సేవల విస్తరణ

ప్రభుత్వ ఆద్వర్యంలో మరిన్ని డయాలసిస్ సెంటర్లు, ముఖ్యంగా గ్రామ-పంచాయతీలలో ఆరోగ్య కేంద్రాల వద్ధ ఏర్పాటు చేయాలని సంకల్పించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక “యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్” విధానం సిద్ధం చేస్తోందని,ఆరోగ్య సేవలను విస్తరించాలని కూటమి ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది.

ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులు ఎక్కువ ఉండటం వల్ల సేవల నిర్వహణలో అంతరాయం వచ్చింది.హెల్త్ కార్డ్ లేకపోతే చికిత్స పొందలేరా?” అనే భయం ప్రజల్లో ఉంది . తాజాగా ఈ ఖర్చులు, వ్యయాల పెరుగుదల, ఆస్పత్రుల నెట్‌వర్క్ విస్తరణ వంటి అంశాలు వేగంగా జరగడంలేదు.

అసలు **డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య పథకం ఏమిటి ?

ఇది పూర్వం ఆరోగ్య శ్రీ పథకంగా ప్రసిద్ధి చెందింది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ప్రారంభించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, దీన్ని పునర్ వ్యవస్థీకరించి, “ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య పథకం”గా మార్చారు. తరువాత మళ్ళీ 2009 లో వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య బీమా పథకంగా మార్పు చెందింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య పథకం గా మార్చింది.

ఈ పథక లక్ష్యం*_*పేదలకు, బలహీన వర్గాలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించడం.

దిగువ దారిద్ర రేఖ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో లేదా ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో సార్వత్రిక ఆరోగ్య రక్షణ లక్ష్యాన్ని సాధించే దిశగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నిధులతో కూడిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తోంది. పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణపై అయ్యే విపత్తు ఖర్చుల నుండి ఉపశమనం అందించడానికి, ఈ పథకం సమానత్వం సాధించడంలో జవాబుదారీ, సాక్ష్యం ఆధారిత, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. దిగువ దారిద్రరేఖ కుటుంబాలకు సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ఈ పథకం ఆరోగ్య బీమా రంగంలో ఒక ప్రత్యేకమైన పీపీపీ నమూనా (ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యం). ఇది పేద రోగుల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని నెట్‌వర్క్ ప్రొవైడర్ల ద్వారా గుర్తించబడిన ద్వితీయ) ,తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ చికిత్సలకు ఎండ్-టు-ఎండ్ క్యాష్‌లెస్ సేవలను అందిస్తోంది.

పథకం ప్రధాన లక్ష్యాలు

ఉచిత, నాణ్యమైన హాస్పిటల్ సంరక్షణ ట్రస్ట్ ద్వారా అందించబడే స్వీయ-నిధులతో కూడిన రీయింబర్స్‌మెంట్ విధానం ద్వారా, గుర్తించబడిన ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్ల నెట్‌వర్క్ నుండి నాణ్యమైన వైద్య సేవలను అందించడం ద్వారా దిగువ దారిద్ర రేఖ కుటుంబాలకు సమాన ఆరోగ్య భద్రత కల్పించడం ఆరోగ్య సంరక్షణపై అయ్యే విపత్తు ఖర్చులకు వ్యతిరేకంగా ఆర్థిక భద్రత కల్పించడం. డిమాండ్ సైడ్ ఫైనాన్సింగ్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య కవరేజీని అందించడం.

ఆరోగ్యశ్రీ పథకం యొక్క లక్ష్యం పేదలకు ఉచిత వైద్యం అందించడం. ప్రభుత్వం తో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం జరిపే చర్చలు ఫలించకపోవడంతో అక్టోబరు 10 నుండి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈ పధకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రెగ్యులర్ పేషెంట్లు వస్తారు. ప్రైవేట్ ఆసుపాత్రులు తాత్కాలికంగా ఈ సేవలు నిలిపివేయడంవల్ల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది.ప్రమాదాలు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి పరిస్థితుల్లో తక్షణ ఉచిత వైద్యం అందకపోవడం ప్రాణనష్టానికి దారితీస్తుంది. వైద్య సదుపాయం ఆలస్యం అయ్యిందంటే రోగి ప్రాణం ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం లేకపోవడం ప్రజలకు ప్రాణాంతకమవుతోంది. రోగులు అవస్థలు లు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణం బకాయి నిధులు విడుదల చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రభుత్వానికి, ప్రైవేట్ ఆసుపత్రులకు మధ్య కుదరని సయోధ్య - Tholi Paluku