
ప్రభుత్వస్థలాల్లో ఆర్ఎస్ఎస్
ప్రభుత్వ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల మైదానాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వొద్దు. ప్రభుత్వ పార్కులు ఎండోమెంట్ దేవాలయాల్లో కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరారు. "రాష్ట్రీయ స్వయం సేవక సంఘం (ఆర్ఎస్ఎస్) ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్థలాలను ఉపయోగించి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీని ద్వారా పిల్లల మనసుల్లో ప్రతికూల ఆలోచనలు పుడుతున్నాయి’ అంటూ ఖర్గే పేర్కొన్నారు.
"పిల్లలు, యువత, సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో ఆర్ఎస్ఎష్ సంస్థ నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలను, శాఖ, సంఘిక్ లేదా బైతాక్ అనే పేర్లలో నిర్వహించరాని విధంగా నిషేధించమని కోరుతున్నాను," అని కాంగ్రెస్ నేత ఖార్గే లేఖలో తెలిపారు.
శతాబ్ధి ఉత్సవాలకు ప్రభుత్వ మద్దతు
ఇటీవల ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో మద్దతు దక్కింది. ప్రభుత్వ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రధాని మోడీ, కొందరు మంత్రులు, వివిధ రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు అధికారిక హోదాలో ఆర్ఎస్ఎస్ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి.
ఎందుకంత అభద్రత
కాగా ప్రియాంక్ ఖర్గే ప్రభుత్వ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించొద్దు అని లేఖ రాయడం పట్ల బీజేపీ మద్దతుదారులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇటువంటి ప్రతికూల ఆలోచనలు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు మరింత బలంగా ఎదగడానికి, మరింత సమగ్రతతో పనిచేయడానికి ప్రేరణనిస్తాయి.’ అంటూ వీహెచ్‌పీ నేత గిరీశ్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.
ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు
ఆర్ఎస్ఎస్ ఎన్నో ఏండ్లుగా శాఖ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ అనుబంధ పాఠశాలలు, సంస్థల్లో నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ కు ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ప్రభుత్వ స్థలాలను ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ఒ వర్గం గురించే బలంగా చెబుతుందన్నది కాంగ్రెస్ లాంటి పార్టీల ఆరోపణ.
చట్టవిరుద్ధమేనా?
ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 441, 442 ప్రకారం ప్రభుత్వ స్థలాలను అనధికారికంగా నిర్వహించడానికి వీలు లేదు. సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వివిధ రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యకలాపాలకు అనుమతి ఉందా? లేదా? అన్నది వేచి చూడాలి. పైగా ఆర్ఎస్ఎస్ కేవలం శతాబ్ధి వేడుకలు మాత్రమే నిర్వహిస్తుంది కాబట్టి ఇందులో చట్ట విరుద్ధమైన, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తారు అనడానికి ఆధారాలు లేవు. ఒకవేళ కాంగ్రెస్ నేతలు అనుమతి లేకుండా ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించినట్టు ఆధారాలు సమర్పిస్తే అందుకు పోలీసులు చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
