Let's talk: editor@tmv.in
ప్రభుత్వమే దాడులు చేయిస్తోంది

ప్రభుత్వమే దాడులు చేయిస్తోంది

Pinjari Chand
9 అక్టోబర్, 2025

మాల్డా బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము, సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌లపై జరిగిన దాడిని కేంద్రమంత్రి సుకాంత మజుందార్ బుధవారం ఖండించారు. ఆయన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇద్దరి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఎమ్మెల్యే శంకర్‌ఘోష్ భూజానికి తీవ్రగాయాలయ్యాయని, ఎంపీ ఖగెన్ ముర్ము కోలుకోవడానికి దాదాపు రెండు నెలలకు పైగా పడుతుందని తెలిపారు. ఎంపీ మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, తృణమూల్ కాంగ్రెస్​ (టీఎంసీ) కార్యకర్తలు, గూండాలు చేసిన దాడి వల్ల ముఖంపై ఉన్న ఒక ఎముక ఒకటి విరిగిపోయిందన్నారు. దీంతో డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు.

శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన విషయం

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తోందని అన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్నందున ఈ దాడి విషయంలో ఏమి చేయలేం. కానీ ఈ పరిస్థితులు ఇలాగే మున్ముందు కూడా కొనసాగితే మనం కోర్టులను ఆశ్రయించాలన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోసం కోర్టుకు వెళ్లాలన్నారు. ఎంపీ ఖగెన్ ముర్ము ఎస్టీ వర్గానికి చెందిన నాయకులు. దాడి చేసిన వారిపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టాన్ని ప్రయోగించాలని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. ప్రజాప్రతినిధుల పరామర్శ అనంతరం ఉత్తరబెంగాల్‌లోని జల్పాయిగురి, మండల్ ఘాట్‌లో భారీవర్షాల వలన, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల సర్వస్వం కోల్పోయిన వారిని పరామర్శించి సహాయ సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన దృష్టికి అనేక సమస్యలు తీసుకువచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో రాజకీయ హింస పెరిగింది

మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి ప్రభుత్వంలో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింస పెరిగిందని బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే, ఎంపీలపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న హింసకు టీఎంసీనే కారణమని విమర్శించారు. ఇటీవల టీఎంసీ మద్దతుదారులు అనేక చోట్ల రావణ దహనాన్ని బలవంతంగా అడ్డుకున్నారని, ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తుందని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని జల్​ ఫాయ్ గురిలోని డూయర్స్ ప్రాంతంలో సోమవారం వరద బాధితులను పరామర్శించి, సహాయ సామగ్రి పంపిణీ కోసం వెళ్లిన బిజెపి ఎంపి ఖాగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌లపై టీఎంసీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఎంపీ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటివరకు వీరిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్​ చేయలేదు.

ప్రభుత్వమే దాడులు చేయిస్తోంది - Tholi Paluku