
ప్రభుత్వం ‘విజన్ 2047’తో ముందుకెళ్తుంది: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా, స్థితిస్థాపకతతో దూసుకుపోతోందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. సోమవారం రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) రూ. 17.82 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఇది 10.7 శాతం అద్భుతమైన వృద్ధి రేటును ప్రతిబింబిస్తోందని ఆయన వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్న వాటాను కూడా ఆయన వివరించారు. దేశ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ వాటా ప్రస్తుతం 4.99 శాతంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 4,18,931కి చేరిందని వెల్లడించారు. ఇదే సమయంలో ధరల స్థిరత్వాన్ని ప్రభుత్వం కొనసాగించగలిగిందని, ద్రవ్యోల్బణం కేవలం 0.2 శాతంగా మాత్రమే నమోదైందని తెలిపారు.
దేశ ఆర్థిక పరిస్థితిని కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన ప్రగతిని సాధిస్తోందని, దేశ వృద్ధిరేటు 8 శాతంగా అంచనా వేయబడిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 1.72 శాతంగా ఉండగా, వ్యక్తిగత ఆదాయం కూడా నిరంతరంగా పెరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా నిలుస్తోందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
విజన్ 2047 - మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం
భారతదేశ స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు జరుపుకునే తెలంగాణ రైజింగ్ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. దీనికి మధ్యంతర లక్ష్యంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దీనికోసం 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047' పత్రాన్ని కేంద్ర ప్రభుత్వ 'వికసిత్ భారత్ 2047' విజన్‌కు అనుగుణంగా, నీతి ఆయోగ్, ఐఎస్‌బి, నల్సార్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో రూపొందించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో సమతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ‘క్యూర్, ప్యూర్, రేర్’ అనే అభివృద్ధి నమూనాను అవలంబించిందని తెలిపారు. గతంలో ఉన్న గతంలో ఉన్న “హైదరాబాద్ కేంద్రిత అభివృద్ధి నమూనా”ను అధిగమిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను జీరో-నెట్ కార్బన్, విజ్ఞాన ఆధారిత గ్లోబల్ హబ్‌గా మారుస్తారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో నూతన 'క్యూర్ చట్టం' తీసుకువస్తారు. పట్టణ శివారు ప్రాంతాలను తయారీ లాజిస్టిక్స్ ఇంజిన్లుగా అభివృద్ధి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో క్లైమేట్-స్మార్ట్ వ్యవసాయం, ఎకో-టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఆర్థిక పునరుజ్జీవనం కలిగిస్తారు అని తెలిపారు.
తెలంగాణలో నగరీకరణ వేగంగా జరుగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. 2031 నాటికి రాష్ట్ర జనాభాలో 53.8 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసించే అవకాశముందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 55 కిలోమీటర్ల మేర సాగే మూసీ రివర్‌ఫ్రంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ పర్యావరణ వ్యవస్థను మారుస్తామన్నారు. ఇప్పటికే 45 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో 39 నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ ప్రాంతం రాబోయే ఏళ్లలో భారీ పారిశ్రామిక కేంద్రంగా మారబోతోందని గవర్నర్ పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఇప్పటికే కార్యకలాపాల దశకు చేరుకుందన్నారు.
హైదరాబాద్ నగర పరిసరాల్లో 30 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు కూడా అభివృద్ధి అనుమతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేసేందుకు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రం ఎగుమతుల్లో దేశంలోనే ఏడవ స్థానంలో ఉందని, సుమారు రూ. 1.61 లక్షల కోట్ల విలువైన వస్తు ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఏరోస్పేస్ రంగం ఇందులో 30 శాతం వాటాను కలిగి ఉంది. ఇక ఐటీ ఎగుమతులు రూ. 3.13 లక్షల కోట్లకు చేరాయని, ఐటీ రంగం ద్వారా సుమారు 9.39 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని ఆయన వెల్లడించారు.
ఆరోగ్యం, సంక్షేమం
ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేపడుతోందని ఆయన వివరించారు. ప్రస్తుతం చికిత్సాధారిత ఆరోగ్య విధానం నుంచి నివారణాధారిత ఆరోగ్య విధానానికి మారుతున్నామని చెప్పారు. 2047 నాటికి ఆరోగ్య ఖర్చును రాష్ట్ర జీడీపీలో 8 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే మాతృ మరణాల నిష్పత్తిను 43కి, శిశు మరణాల రేటును 18కి తగ్గించడంలో రాష్ట్రం విజయవంతమైందని గవర్నర్ పేర్కొన్నారు. ఇవి దేశ సగటు గణాంకాలైన 88 నుంచి 25 కంటే చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కొత్తగా 15.12 లక్షల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అలాగే, రూ. 20,616 కోట్ల వ్యయంతో రైతు రుణమాఫీని అమలు చేసినట్లు గవర్నర్ వివరించారు.
రాజకీయ కోలాహలం, ప్రతిపక్షాల నిరసన
గవర్నర్ ప్రసంగం ప్రారంభం, ముగింపులో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 'జయ జయ హే తెలంగాణ' రాష్ట్ర గీతం, 'వందేమాతరం' జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా సభలో ఉన్నఎంఐఎం శాసనసభ్యులు రాష్ట్ర గీతం, జాతీయ గీతం సమయంలో గౌరవపూర్వకంగా నిలబడ్డారు. అయితే, ప్రసంగం ముగిసిన తర్వాత వందేమాతరం ఆలాపన జరుగుతుండగా వారు సభ నుంచి నిష్క్రమించారు. దీనిని బీజేపీ తీవ్రంగా విమర్శించింది.
ఇదిలా ఉండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. గవర్నర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తుండగా, వారు నినాదాలు చేస్తూ అడ్డుతగిలారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ విధంగా గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతి, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష విమర్శల మధ్య శాసనసభలో రాజకీయ వేడిని పెంచింది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పష్టత వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో, ఈ సమావేశాలను మార్చి 30వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన ఘట్టం మార్చి 20న జరగనుంది. ఆ రోజున రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. నేడు, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు.
మార్చి 19న ఉగాది పండుగను పురస్కరించుకుని సభకు సెలవు ప్రకటించారు. 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం. 23 నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. 30న బడ్జెట్‌కు సభ ఆమోదం తెలపడం, అనంతరం సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులపై ఈ బడ్జెట్‌లో స్పష్టత రానుంది.
