
ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ
తెలంగాణను అంతర్జాతీయ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించాలని బంజారాహిల్స్‌లో జరిగిన స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేవలం ఒక స్టేడియంలా కాకుండా, అన్ని రకాల క్రీడలకు వేదికగా ఒక 'ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సెంటర్'గా దీనిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
స్టేడియం మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి, ఇందులో అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ , ఫుట్‌బాల్ స్టేడియాలు ఉండాలని సూచించారు. అత్యాధునిక శిక్షణ సౌకర్యాలతో కూడిన ఇండోర్, అవుట్ డోర్ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు విమానాశ్రయం నుంచి నేరుగా స్టేడియానికి చేరుకునేలా హెలిప్యాడ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ క్రీడా విభాగాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఇక్కడ నెలకొల్పుతారు.
గచ్చిబౌలి స్టేడియంను దేశంలోనే అత్యుత్తమ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పెట్టుబడి పెట్టే సంస్థలకు బ్రాండింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. స్టేడియం నిర్వహణ ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగేలా ఒక స్థిరమైన ఆర్థిక నమూనాను రూపొందించాలని సూచించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ఒక ఆర్కిటెక్ట్‌ను నియమించడమే కాకుండా, బోర్డుకు పూర్తిస్థాయి నిర్వహణ స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కాలిక దార్శనికతతో పని చేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
