
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి శాసనసభ
రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ప్రభుత్వ సముదాయంలోని శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆధునిక వాస్తుశిల్పంతో పాటు తెలుగు సంస్కృతి, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రతిబింబించేలా భవనాన్ని రూపొందించేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ భాగస్వామి, ఆర్కిటెక్ట్ పెడ్రో హాబెర్‌బోష్, సంస్థ ప్రతినిధులు, సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్, చీఫ్ ఇంజనీర్ ఏ.వి.రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా..
శాసనసభ భవనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పాటు ఆధునిక రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉండాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. భవనంలోని ప్రతి విభాగం ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, సందర్శకులకు సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించడంపై చర్చించారు. సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లు, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ కార్యాలయం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశ మందిరం, మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాలు, వివిధ శాసనసభ కమిటీల సమావేశ మందిరాల ఏర్పాటుపై చర్చ జరిగింది. ప్రధాన సభా మందిరం, కమిటీ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్‌లు, ఎమ్మెల్యేల లాబీలు, ప్రోటోకాల్ ప్రాంతాలు, మీడియా సెంటర్, ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, మీడియా వర్క్‌స్టేషన్లు, బ్రీఫింగ్ సదుపాయాలు, సందర్శకుల గ్యాలరీలు, పబ్లిక్ లాంజ్‌లు, రిసెప్షన్ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడంపై దృష్టి సారించారు.
అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు
శాసనసభ కార్యకలాపాలను ఆధునిక పద్ధతుల్లో నిర్వహించేందుకు ఆడియో–విజువల్ వ్యవస్థలు, డిజిటల్ ఓటింగ్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలు, ఆధునిక కమ్యూనికేషన్ నెట్‌వర్క్, లైవ్ టెలికాస్ట్, బ్రాడ్‌కాస్టింగ్ సదుపాయాలు, డిజిటల్ శాసన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భద్రతకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ మార్గాలు, యాక్సెస్ కంట్రోల్, భద్రతా జోన్లు, పార్కింగ్, డ్రాప్–ఆఫ్, పికప్ ప్రాంతాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ వ్యవస్థలను సమగ్రంగా డిజైన్‌లో భాగం చేయాలని చర్చించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ర్యాంపులు, లిఫ్టులు, ఆధునిక సానిటేషన్ సదుపాయాలతో యూనివర్సల్ యాక్సెసిబిలిటీ ప్రమాణాలను అమలు చేయాలని నిర్ణయించారు. సహజ కాంతి, గాలి ప్రసరణ, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిర్వహణ, పర్యావరణహిత నిర్మాణ పద్ధతులు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను కూడా డిజైన్‌లో భాగం చేయనున్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో శాసనసభ భవనం కేవలం పరిపాలనా నిర్మాణంగా కాకుండా ప్రజాస్వామ్యానికి ప్రతీకగా, తెలుగు సంస్కృతి–వారసత్వానికి అద్దంగా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చిరునామాగా నిలిచేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.
