
ప్రపంచ స్థాయిలో బయోసెక్యూరిటీని బలోపేతం చేయాలి: విదేశాంగ మంత్రి జైశంకర్
జీవ ఆయుధాల ముప్పు, ముఖ్యంగా బయోటెర్రరిజం ఇకపై కేవలం సిద్ధాంతపరమైన విషయం మాత్రమే కాదని, దీనిపై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ హెచ్చరించారు ప్రపంచ భద్రత కోసం జీవ ఆయుధాల ఒప్పందం (బీడబ్ల్యూసీ) కింద ఉన్న ప్రపంచ బయోసెక్యూరిటీ విధానాలను ఆధునీకరించాలని ఆయన కోరారు.
న్యూఢిల్లీలో జరిగిన '50 ఏళ్ల జీవ ఆయుధాల ఒప్పందం: గ్లోబల్ సౌత్ కోసం బయోసెక్యూరిటీని బలోపేతం చేయడం' అనే సదస్సులో జైశంకర్ ప్రసంగించారు. 50 ఏళ్ల నాటి బీడబ్ల్యూసీలో ఉన్న కీలకమైన వ్యవస్థాపరమైన లోపాలను ఆయన ఎత్తి చూపారు. బీడబ్ల్యూసీలో ప్రస్తుతం అమలును పర్యవేక్షించే వ్యవస్థ లేదని, కొత్త శాస్త్రీయ పురోగతులను ట్రాక్ చేయడానికి శాశ్వత సాంకేతిక విభాగం లేదని అన్నారు. "ఈ అంతరాలను పూడ్చడం ద్వారానే విశ్వాసాన్ని బలోపేతం చేయగలం" అని జైశంకర్ నొక్కి చెప్పారు.
జన్యు సవరణ, సింథటిక్ బయాలజీ, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతలలో వేగవంతమైన పురోగతి జరుగుతున్నప్పటికీ, వాటిని దుర్వినియోగం చేయకుండా నియంత్రించే సామర్థ్యం బీడబ్ల్యూసీకి ఉండాలని జైశంకర్ చెప్పారు. కోవిడ్-19 వంటి మహమ్మారి అనుభవాలు చూస్తే, జీవ ముప్పు అనేది సహజమైనదైనా, ప్రమాదవశాత్తు సంభవించినా లేదా ఉద్దేశపూర్వకమైనదైనా, అది వేగంగా కదులుతుంది, సరిహద్దులను దాటుతుంది, వ్యవస్థలను కకావికలం చేస్తుందని ఆయన తెలిపారు.
బయోసెక్యూరిటీలో భారత్ పాత్ర
ప్రపంచవ్యాప్తంగా జీవ సంబంధిత భద్రత వ్యవస్థను బలోపేతం చేయడంలో భారతదేశ పాత్ర చాలా ముఖ్యమైనదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. జీవ ఆయుధాల ఒప్పందం భవిష్యత్తును నిర్ణయించడంలో భారతదేశం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. జీవ ఆయుధాల ఒప్పందం కింద నియమాలను గట్టిగా అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారతదేశం చాలా కాలంగా మద్దతు ఇస్తోందని, అత్యంత ప్రమాదకరమైన జీవ కారకాలను గుర్తించడం, ద్వంద్వ-వినియోగ పరిశోధనలను పర్యవేక్షించడం, దేశంలో జరిగే సంఘటనలపై నివేదికలు ఇవ్వడం, ప్రమాదాలను నిర్వహించడం నిరంతర శిక్షణను కవర్ చేసే 'జాతీయ అమలు ఫ్రేమ్‌వర్క్' కోసం భారతదేశ ప్రతిపాదనను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో లోపాలు ఎక్కువగా ఉండి, మరింత ప్రమాదంలో ఉన్న గ్లోబల్ సౌత్ (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు) సమస్యలను వినిపించాలని, వారి ఆలోచనలు బీడబ్ల్యూసీ భవిష్యత్తును నిర్ణయించాలని జైశంకర్ కోరారు.
ప్రపంచ బయోసెక్యూరిటీని బలోపేతం చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించడానికి గల కారణాలను జైశంకర్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే సాధారణ ఔషధాలలో 20 శాతం కంటే ఎక్కువ భారతదేశం నుంచే వెళ్తున్నాయని, ఆఫ్రికా దేశాలకు అవసరమయ్యే సాధారణ ఔషధాలలో 60 శాతం భారతదేశమే సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. భారతదేశంలో దాదాపు 11 వేల బయోటెక్ స్టార్టప్‌లు ఉన్నాయని, ఈ సంఖ్య ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బయోటెక్ స్టార్టప్ వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెట్టిందని ఆయన అన్నారు. ఈ బలమైన ఔషధ, బయోటెక్ సామర్థ్యాన్ని ఉపయోగించి, ప్రపంచ బయోసెక్యూరిటీని మరింత బలోపేతం చేయడంలో భారతదేశం తప్పక ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ చర్చల ద్వారా జెనీవాలో జరగబోయే బీడబ్ల్యూసీ సమావేశాలకు నిర్మాణాత్మక సహకారం అందుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
