Let's talk: editor@tmv.in
ప్రపంచ సమ్మిళిత అభివృద్ధే భారత్ ఆశయం:ఎంపీ

ప్రపంచ సమ్మిళిత అభివృద్ధే భారత్ ఆశయం:ఎంపీ

Gaddamidi Naveen
12 అక్టోబర్, 2025

న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి రెండో కమిటీలోని ‘మ్యాక్రో ఎకనామిక్ పాలసీ ప్రశ్నలు, ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్‌మెంట్’ పై సాధారణ చర్చలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, భారతదేశం తరఫున మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కలిసి అభివృద్ధి చెందాలని, అదే భారతదేశ శాశ్వత దృష్టి, ఆశయమని పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. వృద్ధి మందగించడంతో పాటు, వాణిజ్య అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్యం సమ్మిళిత వృద్ధికి ప్రధాన ఇంధనం కావాలన్నారు. భారత్ ఎల్లప్పుడూ న్యాయమైన, పారదర్శకమైన, సమగ్ర వాణిజ్య వ్యవస్థకు మద్దతు ఇస్తుందని, తెలిపారు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు సంస్కరణలను తీసుకురావడం అత్యవసరమని, తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుక ప్రపంచ వేదికలపై బలంగా వినిపించగలదన్నారు.

అలాగే ఆయన గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు. అప్పుల పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ అంతర్జాతీయ స్థాయిలో తప్పనిసరి. పెట్టుబడులు వేగంగా సమీకరించడమే కాకుండా, వాటిని స్థిరమైన అభివృద్ధి దిశగా వినియోగించుకోవాల‌న్నారు. స‌మాజంలో , ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం అనే మూడు స్తంభాలపై ఆధారపడిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే అన్ని దేశాలు ఒకే దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు.అన్ని దేశాలు క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుతేనే సుస్థిరమైన‌ ప్రపంచం అభివృద్ది సాధ్యమవుతుందని ఎంపీ వంశీ స్పష్టం చేశారు.

ప్రపంచ సమ్మిళిత అభివృద్ధే భారత్ ఆశయం:ఎంపీ - Tholi Paluku