
ప్రపంచ సంక్షోభాలను భారత్ విజయవంతంగా ఎదుర్కొంది: జైశంకర్
కరోనా మహమ్మారి, ప్రపంచ సంఘర్షణలు, వాతావరణ మార్పులు వంటి పలు అంతర్జాతీయ సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొంటూ భారత్ ఒక బలమైన ప్రపంచ శక్తిగా ఎదిగిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఐఐటీ, రాయ్‌పూర్ 15వ స్నాతకోత్సవ కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. గత దశాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రధాన అంతరాయాలు మూడు అని పేర్కొన్నారు. అవి కోవిడ్-19 మహమ్మారి, కొనసాగుతున్న అంతర్జాతీయ యుద్ధాలు, అలాగే వాతావరణ మార్పుల ప్రభావమని చెప్పారు. ఈ సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాలను ఊహించని స్థాయిలో ప్రభావితం చేశాయని జైశంకర్ తెలిపారు. మహమ్మారి ప్రపంచ జీవన విధానాన్ని మార్చగా, ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు గ్లోబలైజేషన్ ప్రభావం ఎంత లోతుగా ఉందో చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ, అంతర్జాతీయ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ ప్రపంచంలోని ఐదు అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని ఆయన అన్నారు. ఇటీవల వచ్చిన గ్లోబల్ షాక్‌లను భారత్ ధైర్యంగా ఎదుర్కొని బలంగా బయటపడిందని చెప్పారు.
సమగ్ర ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ, దృఢ నాయకత్వం దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసాయని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ విప్లవాన్ని భారత్ ఉత్సాహంగా స్వీకరించడమే కాకుండా దాన్ని జీవితంలోని అనేక రంగాల్లో ప్రయోజనకరంగా ఉపయోగించిందని తెలిపారు. ప్రపంచ పరిస్థితుల్లో మార్పుల నేపథ్యంలో దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడం అత్యంత కీలకమని జైశంకర్ చెప్పారు. దీనినే భారత్ ఆత్మనిర్భర్ భారత్ రూపంలో అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆహారం, ఆరోగ్యం, ఇంధన భద్రత, జాతీయ భద్రత వంటి రంగాల్లో స్వయం సమృద్ధి అత్యంత ముఖ్యమని ఆయన వివరించారు. ప్రపంచ శక్తి సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, దేశాల ప్రభావం, శక్తి స్థాయిల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సాంకేతికత, ఇంధన వనరులు, సైనిక సామర్థ్యం, కనెక్టివిటీ వంటి రంగాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి దేశాల మధ్య పోటీతత్వాన్ని పెంచుతోందని అన్నారు.
దేశ నిర్మాణం క్లిష్ట ప్రక్రియ
ఈ పరిస్థితుల్లో దేశాలు తమ భద్రతను పెంచుకునేందుకు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాపార రంగం, విదేశాంగ విధానంలో కూడా ప్రమాదాలను తగ్గించడం, విభిన్న భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ముఖ్యమవుతోందని వివరించారు. దేశ నిర్మాణం అనేది అనేక అంశాలతో కూడిన క్లిష్ట ప్రక్రియ అని అన్నారు. ఇందులో వ్యాపార రంగం, స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాల పాత్ర కీలకమని చెప్పారు. వ్యాపారం చేయడానికి అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం ఏర్పరుస్తోందని తెలిపారు. పట్టా తీసుకున్న విద్యార్థులు ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించే తరానికి చెందినవారని అన్నారు. సాంకేతికత, సమాచారానికి అందుబాటుతో కొత్త అవకాశాలు వారికి లభిస్తున్నాయని చెప్పారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడు భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లను విస్తరించడం, కీలక వనరులు, సాంకేతికతను సమకూర్చడం, విదేశాల్లో ఉన్న భారతీయులకు సహాయం చేయడం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతోందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ‘బ్రాండ్ ఇండియా’ ప్రతిష్ఠను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
