
ప్రపంచ సంక్షేమం కోసం భారత్ ‘విశ్వగురు’గా మారాలి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
ప్రపంచ సంక్షేమం కోసం భారత్ మరోసారి ‘విశ్వగురు’గా మారాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. ఇందుకోసం హిందూ సమాజం మొత్తం ఒక ఆదర్శంగా నిలవాలని, హిందువులు తమ జీవన విధానంతోనే ప్రపంచానికి దారి చూపాలని ఆయన అన్నారు.
హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం వద్ద నిర్వహించిన విశ్వ సంఘ్ శిబిరం (వీఎస్‌ఎస్) అంతర్జాతీయ సమావేశం ముగింపు కార్యక్రమంలో భాగవత్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సాంకేతికత మానవుడికి బానిసగా ఉండాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. సోషల్ మీడియా విస్తరిస్తుంది. కృత్రిమ మేధ (ఏఐ) కూడా వస్తుంది. అన్నీ వస్తాయి. కానీ సాంకేతికత మనుషులపై ఆధిపత్యం చెలాయించకూడదు. మనుషులే సాంకేతికతకు యజమానులుగా ఉండాలి అని అన్నారు. మానవ మేధస్సు సాంకేతికతను ప్రపంచ సంక్షేమానికి ఉపయోగించే దిశగా సాగాలని, అందుకు హిందూ సమాజం ముందుగా ఆచరణలో చూపించాలని భాగవత్ పేర్కొన్నారు. ఇది కేవలం మాటలతో సాధ్యం కాదు. మన జీవన విధానమే ఉదాహరణగా ఉండాలి. ఈ బాధ్యత మొత్తం భారతీయ సమాజం ముందు ఉంది అని స్పష్టం చేశారు.
ప్రపంచంలోని చాలా దేశాలు గరిష్ట సంఖ్యలో ప్రజలకు గరిష్ట మేలు అనే సూత్రాన్ని సైతం సరిగ్గా అమలు చేయలేకపోయాయని ఆయన విమర్శించారు. అందువల్లే ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు ఆశతో చూస్తోందని వ్యాఖ్యానించారు. హిందూ మూలాలు కలిగినవారు ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా జీవించాలని, వారి జీవనశైలి చూసి ఇతరులు నేర్చుకునేలా ఉండాలని భాగవత్ అన్నారు. అలాంటి ఆదర్శ జీవనంతోనే ‘ధర్మాన్ని’ ప్రపంచమంతటా స్థాపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అయితే, భారత్ లేదా హిందూ సమాజం ప్రపంచానికి నాయకత్వం వహించడం అంటే సైనిక బలంతో గానీ, ఆర్థిక ఆధిపత్యంతో గానీ ఇతరులను అణచివేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. “మా దారి బలప్రయోగం కాదు. ఆదర్శం. ఆచరణ. ధర్మం” అని ఆయన అన్నారు.
విశ్వగురువు - ప్రపంచ అవసరం
భారత్ ‘విశ్వగురు’గా మారడం హిందూ సమాజం ఆశయం మాత్రమే కాదని, అది ప్రపంచ అవసరమని భాగవత్ వ్యాఖ్యానించారు. “ప్రపంచం మన వైపు చూస్తోంది. మనం మరోసారి విశ్వగురు కావాల్సిన సమయం వచ్చింది. ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు. కఠినమైన శ్రమ అవసరం. అనేక రంగాల్లో ఆ శ్రమ కొనసాగుతోంది. ఆ మార్గాల్లో సంఘ్ కూడా ఒకటి” అని తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటూ, సామాజిక మార్పు కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. వారికి సమాజంలో విశ్వాసం లభిస్తోంది. ఎక్కడ చూసినా వారి పనికి ప్రశంసలు వస్తున్నాయి అని పేర్కొన్నారు. మేము ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నాం? మాకు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. మమ్మల్ని మేమే నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మా దేశం. ఇది మా సమాజం. ఇది మా ధర్మం. ఈ బాధ్యతను నెరవేర్చాల్సిన సమయం మళ్లీ వచ్చింది. అందుకోసం దేశం, సమాజం సిద్ధం కావాలి అని భాగవత్ అన్నారు.
చారిత్రక వారసత్వం
వేల సంవత్సరాలుగా హిందువులు మెక్సికో నుంచి సైబీరియా వరకు ఎక్కడా దేశాలను జయించకుండా, ఎవరి మతాలను మార్చకుండా, ప్రపంచానికి నాగరికత, గణితం, ఆయుర్వేదం వంటి విలువైన జ్ఞానాన్ని అందించారని ఆయన గుర్తుచేశారు. ధర్మం క్షీణించడం వల్ల ప్రపంచంలో అసమతుల్యత, తీవ్రవాదం వంటి సమస్యలు తలెత్తాయని, ఆ సమతుల్యతను తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని భాగవత్ అన్నారు. ఈ బాధ్యతను భారత్ నెరవేర్చాల్సిన సమయం వచ్చిందని భాగవత్ చెప్పారు.
విశ్వ సంఘ్ శిబిరం విశేషాలు
డిసెంబర్ 25న ప్రారంభమైన విశ్వ సంఘ్ శిబిరం మూడు రోజుల పాటు కొనసాగింది. ఇందులో హిందూ స్వయంసేవక్ సంఘ్, హిందూ సేవా సంఘ్, విశ్వ హిందూ పరిషత్ తదితర సంస్థల ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 2,000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే విశ్వ సంఘ్ శిబిరం గతంలో బెంగళూరు, వడోదర, ముంబై, గాంధీనగర్, పుణె, ఇండోర్ నగరాల్లో జరిగింది. 2025 సమావేశానికి ‘ధర్మే సర్వం ప్రతిష్ఠితం’ (ధర్మమే అన్నింటికీ పునాది) అనే అంశాన్ని ప్రధాన థీమ్‌గా ఎంచుకున్నారు.
ఈ సమావేశాన్ని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ విశ్వ నికేతన్ అనే నమోదు పొందిన ట్రస్ట్ నిర్వహించింది. ఈ సంస్థ ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల మధ్య భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది.
