Let's talk: editor@tmv.in
ప్రపంచ వ్యవస్థలో నలంద సంప్రదాయం ప్రభావం చూపగలదు: జైశంకర్

ప్రపంచ వ్యవస్థలో నలంద సంప్రదాయం ప్రభావం చూపగలదు: జైశంకర్

Pinjari Chand
1 ఏప్రిల్, 2026

ప్రపంచ వ్యవస్థ ఇప్పుడు మరింత బహుళ ధ్రువాలుగా (మల్లీ పోలర్‌‌) మారుతున్నదని, ఈ ప్రక్రియలో నలంద సంప్రదాయం కీలక ప్రభావం చూపగలదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌‌ తెలిపారు. మంగళవారం బీహార్‌లోని రాజ్‌గిర్‌‌లో ఉన్న నలంద యూనివర్సిటీ రెండో పట్టభద్రుల వేడుకలో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని సంస్కృతులు, సమాజాలు తమ స్వరాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో గ్లోబల్ వ్యవస్థలో ప్రజాస్వామీకరణ పెరుగుతోందని చెప్పారు. ఈ మార్పులో నలంద సంప్రదాయం ప్రభావవంతమైన పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం భారత మేధో సంపద, సంస్కృతీ వైభవానికి ప్రతీకగా నిలిచిందని జైశంకర్ చెప్పారు. ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో కొత్త నలంద విశ్వవిద్యాలయం స్థాపించామని తెలిపారు. ప్రాచీన నలంద అవశేషాలు ప్రస్తుతం యునెస్కో వారసత్వ కట్టడాలుగా గుర్తింపుపొందిన విషయం తెలిసిందే. కొత్త నలంద విశ్వవిద్యాలయాన్ని నరేంద్రమోడీ 2024 జూన్ 19న ప్రారంభించారు. ఇది భారత్‌తో పాటు ఈస్ట్‌ ఏసియా సమ్మిట్‌ దేశాల సహకారంతో ఏర్పడిన అంతర్జాతీయ విద్యాసంస్థగా రూపుదిద్దుకుంది.

మానవ విలువలు మరవకూడదు

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సమయంలో ప్రపంచంతో అనుసంధానం మరింత అవసరమని జైశంకర్ చెప్పారు. భారత్ ప్రపంచానికి సిద్ధంగా ఉండాలి, అలాగే ప్రపంచం కూడా భారతాన్ని అర్థం చేసుకునేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ విద్యార్థులు తమ దేశాలకు తిరిగి వెళ్లిన తరువాత భారత సంస్కృతి, విలువలను ప్రచారం చేసే అవకాశముందని ఆయన అన్నారు. నలంద విశ్వవిద్యాలయం కూడా ప్రాచీన కాలంలాగే విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్నదని తెలిపారు. ప్రపంచ అభివృద్ధి దిశలో ప్రస్తుతం సాంకేతికతపై ఎక్కువ చర్చ జరుగుతున్నప్పటికీ, మానవ విలువలను మరవకూడదని జైశంకర్ సూచించారు. నలంద సంప్రదాయం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. సాంకేతికతతో పాటు సంప్రదాయాలు కూడా కలిసి ముందుకు సాగాలి. అభివృద్ధి కూడా, వారసత్వం కూడా కలిసి నడవాలని ఆయన అన్నారు. పట్టభద్రులైన విద్యార్థులు తమ విజయాలతో నలంద విశ్వవిద్యాలయానికి గౌరవాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గోన్నారు.

ప్రపంచ వ్యవస్థలో నలంద సంప్రదాయం ప్రభావం చూపగలదు: జైశంకర్ - Tholi Paluku