
ప్రపంచ వాణిజ్యంలో కొత్త ఆశ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కేవలం యుద్ధానికి ముగింపు కాదు, ప్రపంచ వాణిజ్యానికి కూడా కొంత ఊరట తీసుకురాగలదు కూడా. గాజాలో రెండేళ్లుగా కొనసాగుతున్న రక్తపాతం తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. కానీ దీని ప్రతిధ్వని అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వినిపిస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి ప్రతీకగా భావించే మాస్క్ కంపెనీ షేర్లు ఈ ఒప్పందం ప్రకటించిన వెంటనే మూడు నెలల కనిష్ట స్థాయికి చేరాయి. యుద్ధంతో నాశనం అయిన రెడ్‌సీ మార్గం మళ్లీ తెరుచుకునే అవకాశం పెట్టుబడిదారులలో ఆశను రేకెత్తించినప్పటికీ, ఆ మార్గం భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.
2023 చివరి నుంచి గ్లోబల్ ఫ్రైట్ రేట్లు మూడింతల వరుకు పెరిగాయి. హౌతి తిరుగుబాటుదారులు రెడ్‌సీ మార్గంలో నౌకలపై దాడులు ప్రారంభించడంతో ప్రధాన షిప్పింగ్ కంపెనీలు సురక్షిత మార్గాల కోసం ఆఫ్రికా దక్షిణ తీరంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వెళ్లడం ప్రారంభించాయి. ఇది దూరం పెంచడంతో పాటు ఇంధన వ్యయం, రవాణా సమయాన్ని భారీగా పెంచింది. ఫలితంగాభారత కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.
ఇంతవరకు వాణిజ్య ప్రపంచం ఆ సంక్షోభాన్ని లాభంగా మార్చుకున్నది షిప్పింగ్ కంపెనీలే. అదనపు ఛార్జీలు, పెరిగిన రవాణా సమయాల వల్ల వారి ఆదాయం విపరీతంగా పెరిగింది. కానీ భారతదేశానికి ఇది నష్టమయ్యింది. దేశ వాణిజ్యంలో 90 నుంచి 95 శాతం వరకు రవాణా సేవలను విదేశీ నౌకలే అందిస్తున్నాయి. ఈ కారణంగా భారత ఎగుమతిదారులు రవాణా కంపెనీల 'ఆర్మ్ ట్విస్టింగ్' ధోరణిపై తీవ్రంగా విమర్శించారు. రవాణా సేవల పేరుతో ఇండియా ప్రతి సంవత్సరం 100 బిలియన్ డాలర్లకు పైగా చెల్లిస్తున్నదని వారు ప్రభుత్వానికి తెలిపారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సద్దుమణిగితే రెడ్‌సీ మార్గం మళ్లీ తెరవబడే అవకాశం ఉంది. దీంతో యూరప్ వైపుకు వెళ్లే భారత ఉత్పత్తులకు.. ముఖ్యంగా తక్కువ మార్జిన్ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు, వస్త్రాలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులకు రవాణా సౌలభ్యం కలగవచ్చు. భారత వాణిజ్యానికి సుయేజ్ కాలువ మార్గం అత్యంత కీలకం. యూరప్, అమెరికా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలకు వెళ్లే సరకు రవాణాలో ఇది ప్రధాన బంధం. ఈ మార్గం మళ్లీ తెరవబడితే సమయ, వ్యయ భారం రెండూ తగ్గవచ్చు.
అయితే ఈ ఊరట ఎంతకాలం నిలుస్తుందో ఇంకా స్పష్టత లేదు. హౌతీల స్పందన కీలకం. వారు దాడులను ఆపుతారా లేదా అన్నదే అసలు ప్రశ్న. షిప్పింగ్ సంస్థలు మళ్లీ సుయేజ్ మార్గంలో ప్రయాణం ప్రారంభించడానికి ముందు భద్రతా హామీ కోరుతున్నాయి. ఈ సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థలోని మరొక బలహీనతను బయటపెట్టింది. అదేంటంటే సముద్ర రవాణాలపై పూర్తిగా ఆధారపడటం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక షిప్‌బిల్డింగ్ పరిశ్రమను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. చైనా ఈ రంగంలో ప్రపంచ ఆధిపత్యం సాధించడంతో భారతదేశానికి వ్యూహాత్మకంగా ఇది ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఇటీవలే రూ. 69,725 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రూ. 24,736 కోట్ల నిధితో షిప్‌బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ 2036 వరకు పొడిగించబడింది. అలాగే షిప్‌బ్రేకింగ్ క్రెడిట్ నోట్, నేషనల్ షిప్‌బిల్డింగ్ మిషన్ వంటి కొత్త పథకాలు కూడా రూపొందించబడ్డాయి.
ఈ పథకం అమలుతో దేశంలో 4.5 మిలియన్ గ్రాస్ టన్నేజ్ సామర్థ్యం గల నౌక నిర్మాణ సామర్థ్యం ఏర్పడుతుందని, సుమారు 30 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు సముద్ర రంగంలోకి ప్రవహించే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ప్రస్తుతం విదేశీ నౌకలకు ప్రతి సంవత్సరం భారతదేశం చెల్లిస్తున్న మొత్తం రూ. 6 లక్షల కోట్లకు సమానంగా ఉంది. దీన్ని తగ్గించి దేశీయ సామర్థ్యాన్ని పెంచడం ద్వారానే వాణిజ్య స్వావలంబన సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అంతర్జాతీయ వేదికలోని ఈ పరిణామాలు చూపిస్తున్న ఒక స్పష్టమైన నిజం.. యుద్ధాలు కేవలం రాజకీయ భౌగోళిక సమీకరణాలను మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక ప్రవాహాలనే కూడా మార్చేస్తాయి. రెడ్‌సీ మార్గం తెరవడం కేవలం వాణిజ్య సౌలభ్యం కాదు, గ్లోబల్ సరఫరా గొలుసుకు కొత్త ఊపిరి. కానీ అది దీర్ఘకాలిక శాంతిపై ఆధారపడి ఉంటుంది. యుద్ధం ముగిసినా, వాణిజ్య భద్రత మార్గంపై మాత్రం క్లారిటీ లేదు.
