Let's talk: editor@tmv.in
ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే మలుపుగా ఏఐ సమ్మిట్: ప్రధాని మోడీ

ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే మలుపుగా ఏఐ సమ్మిట్: ప్రధాని మోడీ

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

ప్రపంచం భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (ఏఐ) శక్తిని ఎలా వినియోగించుకుంటుందో దాని దిశను నిర్ణయించే మలుపుగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నాయకులు, పరిశ్రమల ప్రముఖులు, స్టార్ట్-అప్ రంగానికి చెందిన ఆవిష్కర్తలు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో భారతదేశం సాధించిన పురోగతిని చూసి అంతర్జాతీయ నాయకులు ఆకర్షితులయ్యారని ఆయన అన్నారు. ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఈ ఏఐ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా విశేష చర్చకు దారితీసిందన్నారు. భవిష్యత్తులో ప్రపంచం ఏఐ శక్తిని ఎలా వినియోగించుకుంటుందో ఈ సమ్మిట్ ఒక మలుపు బిందువుగా నిలిచిందని వ్యాఖ్యానించారు. సమ్మిట్ సందర్భంగా రెండు అంశాలు ప్రత్యేకంగా ప్రపంచ నాయకులను ఆకట్టుకున్నాయని తెలిపారు. మొదటిది అమూల్ స్టాల్‌లో ప్రదర్శించిన ఏఐ ఆధారిత పశు సంరక్షణ పరిష్కారం. 24 గంటల ఏఐ సహాయంతో రైతులు తమ పశువుల ఆరోగ్య పరిస్థితిని ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించగా అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. రెండవది భారతీయ సంస్కృతి పరిరక్షణకు సంబంధించిన ప్రాజెక్టు. పురాతన గ్రంథాలు, శాస్త్రాలు, పాండులిపులను ఏఐ సాయంతో సంరక్షిస్తూ, వాటిని ఆధునిక తరం అవసరాలకు అనుగుణంగా మార్చుతున్న విధానం ప్రపంచ నేతలను మెప్పించిందన్నారు. సమ్మిట్ సందర్భంగా భారత్‌లో తయారైన మూడు స్వదేశీ ఏఐ మోడళ్లను కూడా విడుదల చేశామని, ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని ప్రధాని పేర్కొన్నారు.

డిజిటల్ మోసాలపై హెచ్చరిక

దేశంలో రోజురోజుకి డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, అమాయకులు ఇలాంటి మోసాలకు బలవుతున్నారని చెప్పారు. బ్యాంకులు కేవైసీ లేదా రీ-కేవైసీ చేయాలని సందేశాలు పంపితే ఆందోళన చెందవద్దని, అది ఖాతా భద్రత కోసం అవసరమని స్పష్టం చేశారు.

టీ-20 ప్రపంచకప్‌లో భారతీయ మూలాలు

టీ-20 వరల్డ్ కప్‌లో ఇతర దేశాల తరఫున ఆడుతున్న భారతీయ మూలాలు ఉన్న క్రీడాకారుల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ముఖ్యంగా కెనడా జట్టులో అత్యధికంగా భారతీయ మూలాల ఆటగాళ్లు ఉన్నారని తెలిపారు. కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా గర్దాస్‌పూర్‌లో జన్మించగా, నవ్‌నీత్ ధాలీవాల్ చండీగఢ్‌కు చెందినవారని చెప్పారు. హర్ష్ ఠాకర్, శ్రేయస్ మొవా వంటి పలువురు ఆటగాళ్లు కెనడాతో పాటు భారత గౌరవాన్ని పెంచుతున్నారని అన్నారు. ఇది భారతీయతకు నిదర్శనమని, భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ మూలాలతో అనుబంధాన్ని కొనసాగిస్తారని పేర్కొన్నారు.

రాజాజీ ఉత్సవం

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘బానిసత్వపు మనస్తత్వం నుంచి విముక్తి’ సాధనపై తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని, దేశం బానిసత్వ చిహ్నాలను విడిచిపెట్టి భారతీయ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను గౌరవిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌లో ‘రాజాజీ ఉత్సవం’ నిర్వహించి, స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ అయిన సీ. రాజాగోపాలచారి విగ్రహాన్ని కేంద్ర ప్రాంగణంలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

పరీక్షలపై సందేశం

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సందేశమిస్తూ వారిని ‘ఎగ్జామ్ వారియర్స్’ గా సంబోధించారు. మార్కుల పట్టికే మీ విలువను నిర్ణయించదని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ప్రతి తరం విద్యార్థులు అనుభవించే సందేహాలు సహజమని, కాబట్టి ఆందోళన చెందవద్దని అన్నారు.

జయలలితకు నివాళులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత జయంతి (ఫిబ్రవరి 24) సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. అలాగే కేరళలో శతాబ్దాల చరిత్ర గల ‘మామంగం’ సంప్రదాయం దాదాపు 250 ఏళ్ల తర్వాత మళ్లీ పునరుజ్జీవం పొందిందని ప్రస్తావించారు.

కేరళ చిన్నారి అలిన్ షెరిన్ గురించి

దేశంలో అవయవ దానంపై అవగాహన పెరుగుతోందని ప్రధాని అన్నారు. తన 131వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కేరళకు చెందిన 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహాంను స్మరించారు. తల్లిదండ్రులకు తమ సొంత బిడ్డను కోల్పోవడం కన్నా పెద్ద దుఃఖం లేదు. ఎంతో చిన్న వయసులో బిడ్డను కోల్పోవడం మరింత బాధాకరం. కొద్ది రోజుల క్రితం కేరళకు చెందిన చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహాం మనల్ని విడిచిపోయింది. దేశంలో అవయవ దానంపై అవగాహన పెరుగుతోంది. వైద్య పరిశోధనలకు కూడా ఇది తోడ్పడుతోంది. అలిన్ లాంటి ఎంతో మంది అవయవ దానం ద్వారా మరొకరికి కొత్త జీవితం ఇచ్చారని ప్రధాని పేర్కొన్నారు.