Let's talk: editor@tmv.in
ప్రపంచ బ్యాంక్‌కు తెలంగాణ ఎమ్మెల్యే లేఖ

ప్రపంచ బ్యాంక్‌కు తెలంగాణ ఎమ్మెల్యే లేఖ

Gaddamidi Naveen
28 సెప్టెంబర్, 2025

"మా నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు, మ‌మ్మ‌ల్ని ఆర్థికంగా ఆదుకోండి" అంటూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మ‌ద‌న్‌మోహ‌న్ రావు ప్ర‌పంచ బ్యాంకుకు లేఖ రాశారు. అధికారిక పార్టీ ఎమ్మెల్యే ప్ర‌భుత్వాన్ని వ‌దిలి ప్ర‌పంచ బ్యాంకుకు లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం లేక మ‌దుసూద‌న్ రావు ఇలా చేశారా? లేక మ‌రేదైనా కార‌ణం ఉందా అని చ‌ర్చ న‌డుస్తోంది. ఇటీవ‌లి కామారెడ్డిలో క్లౌడ్ బ‌ర‌స్ట్ అయ్యి తీవ్ర వర్షాలు, వరదల వల్ల భారీ న‌ష్టం క‌లిగింది. దీంతో ప్ర‌పంచ బ్యాంకు గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రెడక్షన్ అండ్ రికవరీ నుంచి రూ.100 కోట్లు ఆర్థిక సహాయం అందించాల‌ని ఎమ్మెల్యే కోరారు.

ఎమ్మెల్యే తన లేఖలో గత 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల మా నియోజకవర్గం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, జీవనాధారాలు, అవసరమైన ప్రజా సదుపాయాలపై ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపింద‌న్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, అత్యవసర అవసరాల కోసం, పునర్నిర్మాణ పనులను చేపట్టేందుకు సుమారు రూ.100 కోట్లు అవసరమవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నిధులను వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వ్యవస్థలు, విద్య, రోడ్డు మౌలిక వసతుల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. దీనిపై మరింత చర్చించేందుకు వర్చువల్ సమావేశానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

జిల్లాలో**భారీ వర్షాలతో అపార నష్టం

కామారెడ్డి జిల్లాలో వరదలతో దాదాపు 25,500 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి, ఇందులో అధికంగా వరి పంటకు నష్టం జరిగింది. రోడ్లు, వంతెనలు కూడా ధ్వంసం అయ్యాయి, దీనితో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. దీనిపై పూర్తిస్థాయి నివేదికలను రూపొందించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లడంతో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంలో మూడు కాలనీలు నీట మునిగాయి. వందలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి.

భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి నీటి వనరులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టుతో పాటు కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్‌తో సహా 203 చెరువులు, కాలువలకు నష్టం జరిగింది. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5 కోట్లు అవసరమని, పూర్తిస్థాయిలో నిర్మించేందుకు రూ.44 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ. 251.36 కోట్లు అవసరమవుతాయని ఆయా శాఖల అధికారులు అంచనా వేశారు. ఇందులో తక్షణ మరమ్మతుల కోసం రూ.38.68 కోట్లు, పూర్తిస్థాయి పనులకు రూ.212.68 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు.1,454 ఇళ్లు దెబ్బతిన్నాయి.118 పశువులు, 53,270 కోళ్లు మత్యువాత పడ్డాయి. విద్యుత్‌ శాఖకు సంబంధించి 38 గ్రామాల్లో 864 విద్యుత్‌ స్తంభాలు, 51.84 కిలో మీటర్ల వైర్లు దెబ్బతినగా.589 ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన కరువు

సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 4న వరద బాధిత ప్రాంతాల‌లో ప‌ర్య‌టించారు. బాధితుల‌ సమస్యలు తెలుసుకున్నారు. జిల్లాలో పంట నష్టం ఎక్కువగా జరిగిందని. వరద బాధితులను ఆదుకునేందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రూ.100 కోట్లు తక్షణం మంజూరు చేస్తామని తెలిపారు. అక్కడి అధికారులకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దాదాపు నెలరోజులు కావస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి నిధులు అమలు చేయడంలో ఆలస్యం చేయడంతో మదన్ మోహన్ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ లేఖపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సొంత ప్రభుత్వం మీద నమ్మకం లేక ప్రపంచ బ్యాంక్ కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే లేఖ రాశాడా అని ప్రతిపక్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఒక రకంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే హామీల అమలు, ప్రతిపక్షాల ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు ఈ ఘటనను ఆసరాగా తీసుకొని ప్రతిపక్షాలు విమర్శలతో మరింత రెచ్చిపోయే అవకాశముంది. రాజకీయంగా ఇది కాంగ్రెస్ కు నష్టాన్ని కలిగించనుంది.

ప్రపంచ బ్యాంక్‌కు తెలంగాణ ఎమ్మెల్యే లేఖ - Tholi Paluku