Let's talk: editor@tmv.in
ప్రపంచ పోలియో దినోత్సవం 2025: భయానక వ్యాధి పై మానవజాతి యుద్ధం

ప్రపంచ పోలియో దినోత్సవం 2025: భయానక వ్యాధి పై మానవజాతి యుద్ధం

Dr.Chokka Lingam
25 అక్టోబర్, 2025

పోలియో లేదా పోలియోమైలిటిస్ అనేది మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన వ్యాధులలో ఒకటి. పోలియో వైరస్ కారణంగా వచ్చే ఈ అంటువ్యాధి ప్రధానంగా చిన్నపిల్లల నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. తీవ్రమైన సందర్భాలలో ఇది శాశ్వత పక్షవాతం లేదా మరణానికి కూడా దారితీస్తుంది.అనేక శతాబ్దాలు పోలియో వ్యాప్తి మనుషులను పీడించింది . కాళ్లకు బెల్టులు వేసుకుని నడిచే పిల్లలు, ఇనుప కాళ్లు ధరించిన రోగులు — ఇవన్నీ పోలియో భీకరతకు చిహ్నాలుగా నిలిచాయి. కానీ ఈ వ్యాధిని మన విజ్ఞానం, మన సంకల్పం, మన సమైక్య కృషితో జయించాము

పోలియో అంటే ఏమిటి?

పోలియో అనేది ఒక అత్యంత అంటువ్యాధి వైరస్, ఇది సాధారణంగా మలమార్గం ద్వారా నోటిలోకి (fecal–oral route) ప్రవేశిస్తుంది అంటే మలంతో కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా మానవ శరీరంలో ప్రవేశించి, పెరిగి తర్వాత నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పోలియోకు మూడు రకాల వైరస్‌లు ఉన్నాయి టైప్ 1, టైప్ 2, టైప్ 3.టైప్ 2ను 2015లో, టైప్ 3ను 2019లో నిర్మూలించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం టైప్ 1 వైరస్ మాత్రమే ఇంకా పాకిస్థాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో ఉంది.ప్రతి 200 మందిలో ఒక్కరికి వైరస్ నాడులను పూర్తిగా దెబ్బతీస్తుంది, దాంతో పక్షవాతం వస్తుంది. వారిలో 5–10 శాతం మంది శ్వాసకోశ కండరాలు పనిచేయక మరణిస్తారు.

పోలియో చరిత్ర - శతాబ్దాల యుద్ధం

ప్రాచీన కాలం: ఈజిప్టు శిలాశాసనాల్లో స్తంభించిన కాళ్లతో ఉన్న వ్యక్తుల ప్రతిమలు పోలియోకు తొలి నిదర్శనాలు .

19వ శతాబ్దం: యూరప్, అమెరికాలో భారీ వ్యాప్తి.

1950లలో: అమెరికాలో ప్రతి సంవత్సరం వేలాది పిల్లలు పక్షవాతానికి గురయ్యారు.

1955: డాక్టర్ జోనస్ సాల్క్ రూపొందించిన ఇంజెక్షన్ వ్యాక్సిన్ (IPV) తొలి విజయవంతమైన టీకా.

1961: డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ రూపొందించిన మౌఖిక వ్యాక్సిన్ (OPV) ప్రపంచ వ్యాప్తి సాధించింది.

1988: ప్రపంచ పోలియో నిర్మూలన మిషన్ (GPEI) ప్రారంభమైంది - WHO, UNICEF, రోటరీ ఇంటర్నేషనల్, CDC కలిసి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో 3.5 లక్షలకుపైగా పిల్లలు ప్రతి సంవత్సరం పక్షవాతం బారినపడుతున్నారు.

నేడు ఆ సంఖ్య 99 శాతం తగ్గింది, మానవ సంకల్పం, సాంకేతికత, సేవా ధృక్పథం కలసి సాధించిన అద్భుత ఫలితమిది. పోలియో వ్యాప్తి సమయాల్లో ప్రజలు పాఠశాలలు, ఈత కొళ్లు, సినిమా హాళ్లు మూసివేసేవారు. తల్లిదండ్రులు ప్రతి వేసవిలో భయంతో జీవించేవారు. ఈ వ్యాధి కుటుంబాలను, ఆర్థిక వ్యవస్థలను, భావోద్వేగాలను దెబ్బతీసింది. కానీ ప్రస్తుతం భారతదేశం సహా ప్రపంచంలోని ఎక్కువ దేశాలు పోలియో వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నాయి. అయినా పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ వంటి ప్రాంతాల్లో వైరస్ ఇంకా కనిపిస్తోంది.పోలియో నిర్మూలనకు ఏర్పడిన మౌలిక సదుపాయాలు శీతల గొలుసు (cold chain), టీకా శిబిరాలు, పర్యవేక్షణ వ్యవస్థలు ఇప్పుడు కోవిడ్-19 టీకా వంటి ఇతర ఆరోగ్య కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి.

భారతదేశంలో పోలియో చరిత్ర - నిరాశ నుంచి విజయం దాకా

భారతదేశపు పోలియో యుద్ధం ప్రపంచ ఆరోగ్య చరిత్రలో ఒక ప్రేరణాత్మక విజయగాథ.

1990లలో భారతదేశం ప్రపంచంలోని పోలియో కేసులలో దాదాపు 60 శాతం వాటా కలిగి ఉండేది. జనాభా అధికం, పరిశుభ్రత లోపం, ఆరోగ్య సదుపాయాల కొరత ఇవన్నీ ఈ పోరాటాన్ని కష్టతరం చేశాయి.అయినా 1995లో ప్రారంభమైన “పల్స్ పోలియో” కార్యక్రమం దేశాన్ని మలుపు తిప్పింది. లక్షలాది ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, స్థానిక నాయకులు కలిసి “రెండు చుక్కల జీవం” (Do Boond Zindagi Ki) నినాదంతో ప్రతి పిల్లవాడికి టీకా అందించారు.ప్రతి సంవత్సరం జరిగే జాతీయ టీకా దినోత్సవాలు (National Immunization Days) ద్వారా ఒకే రోజులో 17 కోట్లకుపైగా పిల్లలు వ్యాక్సిన్ పొందేవారు. WHO, UNICEF, Rotary, CDC వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా పర్యవేక్షణ, లాజిస్టిక్స్ వ్యవస్థలు బలపడ్డాయి.ఈ కృషి ఫలితంగా 2011 జనవరిలో భారతదేశంలో చివరి పోలియో కేసు నమోదైంది, మరియు 2014 మార్చిలో WHO భారతదేశాన్ని “పోలియో-రహిత దేశంగా” ప్రకటించింది. ప్రస్తుతం కూడా వైరస్ తిరిగి ప్రవేశించకుండా నిరోధించేందుకు పరిశీలన మరియు అదనపు టీకా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

భారతదేశం నేడు ప్రపంచానికి ఒక ఆరోగ్య మోడల్ సంకల్పం, అవగాహన, అంతర్జాతీయ సహకారం కలిసినప్పుడు అసాధ్యం అనిపించిన లక్ష్యం కూడా సాధ్యమవుతుందని నిరూపించింది.

నిరోధం మరియు చికిత్స

పోలియోకు చికిత్స లేదు, కానీ నిరోధం 100% సాధ్యమవుతుంది. దీనికి రెండు ప్రధాన వ్యాక్సిన్‌లు ఉన్నాయి:

ఇంజెక్షన్ వ్యాక్సిన్ (IPV) – వ్యక్తిగత రక్షణ అందిస్తుంది.

మౌఖిక వ్యాక్సిన్ (OPV) – సులభంగా ఇవ్వవచ్చు, సమాజ స్థాయిలో రక్షణ కల్పిస్తుంది.

భారతదేశపు “రెండు చుక్కల జీవం” ఉద్యమం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీకా ప్రచారాల్లో ఒకటిగా గుర్తించబడింది.

దీర్ఘకాల ప్రభావాలు మరియు సంక్లిష్టతలు

చాలా మందిలో పోలియో లక్షణాలు కనిపించకపోయినా, కొందరిలో కండరాల బలహీనత,శరీర ఆకృతిలో మార్పులు, ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, దశాబ్దాల తర్వాత కండరాల నొప్పి, అలసట కనిపించవచ్చు . ఇలాంటి బాధితులకు భౌతిక చికిత్స, మానసిక మద్దతు, పునరావాసం జీవితాంతం అవసరం.

ఇంకా మిగిలిన సవాళ్లు

99% వరకు విజయవంతమైనప్పటికీ, చివరి 1% కేసులు తొలగించడం అత్యంత కష్టం.

కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు, దుర్భేద్య ప్రాంతాలు ,వ్యాక్సిన్‌పై అపోహలు, రాజకీయ అస్థిరత, ఆరోగ్య వ్యవస్థల బలహీనత. అదనంగా, కొన్ని సందర్భాల్లో టీకా-ఉత్పన్న పోలియో వైరస్ (VDPV) కూడా కొత్త ప్రమాదంగా మారింది. దీనిని ఎదుర్కోవడానికి కొత్త nOPV2 టీకా ప్రవేశపెట్టబడింది.

పోలియో-రహిత భవిష్యత్తు కోసం ఏం చేయాలి?

• ప్రతి పిల్లవాడికి టీకా తప్పనిసరి చేయాలి.

• పర్యవేక్షణ వ్యవస్థలు బలోపేతం చేయాలి.

• అపోహలను ఎదుర్కొని అవగాహన పెంచాలి.

• ఆరోగ్య సిబ్బందికి భద్రత, గౌరవం, ప్రోత్సాహం ఇవ్వాలి.

• అంతర్జాతీయ సహకారం నిరంతరంగా కొనసాగాలి.

ప్రపంచ పోలియో దినోత్సవం ఒక స్మారక దినం మాత్రమే కాదు ఇది మానవ సంకల్పం యొక్క విజయోత్సవం. భయాన్ని నమ్మకంగా మార్చిన ఈ పోరాటం, విజ్ఞానాన్ని ప్రజల జీవన హక్కుగా మార్చిన ఉద్యమం.ఇప్పుడు మనం అంతిమ విజయానికి అంచున ఉన్నాం.

“ప్రతి పిల్లవాడు రక్షించబడే వరకు ఎవ్వరూ సురక్షితులు కారు.”

ఈ సందేశంతో పోలియోపై చివరి విజయం సాధిద్దాం ఆ _రెండు చుక్కల జీవం_ ప్రపంచాన్ని రక్షించగలదు

ప్రపంచ పోలియో దినోత్సవం 2025: భయానక వ్యాధి పై మానవజాతి యుద్ధం - Tholi Paluku