
ప్రపంచ కాలుష్య దేశాల్లో భారత్‌కు 6వ స్థానం
ప్రపంచంలో గాలి కాలుష్యం పరంగా భారత్ 6వ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ‘లోని’ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలవగా, ఢిల్లీ నాలుగో స్థానంలో ఉందని 2025 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వెల్లడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసిన ఈ నివేదికలో 143 దేశాలు, ప్రాంతాలు, భూభాగాల్లోని 9,446 నగరాల డేటాను విశ్లేషించారు. నివేదిక ప్రకారం, అత్యంత కాలుష్య దేశాల జాబితాలో పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్, తజకిస్థాన్, చాద్, కాంగో తదుపరి స్థానాల్లో నిలిచాయి. భారత్ ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత కాలుష్య నగరాల్లో ఐదు నగరాలు భారత్‌కు చెందినవే. లోని, బైర్‌నిహట్, ఢిల్లీ, ఘజియాబాద్, ఉలా ఈ జాబితాలో ఉన్నాయి.
లోని నగరంలో వార్షిక సగటు పీఎం2.5 స్థాయి 112.5 మైక్రోగ్రామ్‌లుగా నమోదైందని నివేదిక పేర్కొంది. ఇది 2024తో పోలిస్తే సుమారు 23 శాతం ఎక్కువగా ఉండటంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల కంటే 22 రెట్లు అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 శాతం నగరాలే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన పీఎం2.5 ప్రమాణాలను (5 µg/m³) చేరుకున్నాయి. ఇది గత ఏడాది 17 శాతం నుంచి తగ్గింది.
2025లో గ్లోబల్ స్థాయిలో అడవులు దహించుకుపోవడం(వైల్డ్‌ఫైర్లు) గాలి కాలుష్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది. యూరప్, కెనడాలో భారీగా కార్బన్ ఉద్గారాలు నమోదయ్యాయి. ఉత్తర అమెరికాలో కెనడా అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. అక్కడి అడవుల అగ్నిప్రమాదాలు అమెరికా, యూరప్ ప్రాంతాల గాలి నాణ్యతపై కూడా ప్రభావం చూపించాయి. అమెరికాలో సగటు పీఎం2.5 స్థాయి 7.3 µg/m³కు పెరిగింది. ఎల్ పాసో అత్యంత కాలుష్య నగరంగా నమోదైంది. యూరప్‌లో 23 దేశాల్లో కాలుష్యం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్, గ్రీస్ దేశాల్లో 30 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. ఇక గాలి నాణ్యత పర్యవేక్షణ చాలా కీలకమని నిపుణులు పేర్కొన్నారు. డేటా లేకపోతే ప్రజలు పీల్చే గాలిలో ఏముందో అర్థం చేసుకోవడం కష్టమని ఫ్రాంక్ హమ్మీస్ అన్నారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచించారు.
