
ప్రపంచ ఔషద కేంద్రం భారత్: జేపీ నడ్డా
దేశీయంగా తయారైన టెటనస్–వయోజన డిఫ్తీరియా (టీడీ) వ్యాక్సిన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్(సీఆర్ఐ)లో అధికారికంగా ప్రారంభించారు. దీంతో టెడీ (టీడీ) వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్(యూఐపీ) కింద సరఫరా చేయనున్నారు. ఏప్రిల్ నాటికి సీఆర్ఐ 55 లక్షల డోసులను యూఐపీకి అందజేస్తుందని, తరువాతి సంవత్సరాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతామని నడ్డా తెలిపారు.
చారిత్రాత్మక ఘట్టం
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సిబ్బందిని అభినందించిన మంత్రి, టెడీ వ్యాక్సిన్ ప్రారంభం దేశ ఆరోగ్య భద్రతను బలోపేతం చేసే చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆరోగ్య, ఔషధ రంగాల్లో ఆత్మనిర్భర భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. స్వదేశీ టెడీ వ్యాక్సిన్ ఆ దిశగా తీసుకున్న కీలక అడుగని వివరించారు.
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’
ప్రపంచానికి భారత్ ఔషధాల కేంద్రంగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోనే ప్రముఖ వ్యాక్సిన్ తయారీ దేశాల్లో ఒకటిగా ఎదిగిందని నడ్డా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గ్లోబల్ బెంచ్‌మార్కింగ్‌లో భారత నియంత్రణ వ్యవస్థ ‘మ్యాచ్యూరిటీ లెవల్–3’ సాధించిందని చెప్పారు. ఈ ప్రమాణాలు సాధించడంలో సీఆర్ఐ వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
కోవిడ్ కాలంలో వేగవంతమైన పురోగతి
గతంలో టెటనస్ వ్యాక్సిన్ అభివృద్ధికి దశాబ్దాలు పట్టాయని, క్షయవ్యాధి ఔషధాల అభివృద్ధికి దాదాపు 30 సంవత్సరాలు పట్టిందని, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్‌కు శతాబ్దం సమయం పట్టిందని గుర్తుచేశారు. కానీ కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ తొమ్మిది నెలల్లోనే రెండు స్వదేశీ వ్యాక్సిన్లు అభివృద్ధి చేసి, 220 కోట్లకు పైగా డోసులను (బూస్టర్ డోసులతో సహా) పంపిణీ చేసిందని తెలిపారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు డిజిటల్‌గా అందించడం ద్వారా ప్రజారోగ్య రంగంలో డిజిటల్ మార్పును ప్రదర్శించిందని చెప్పారు. ‘వాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద దాదాపు 100 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయగా, అందులో 48 దేశాలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
యూఐపీ – ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం
యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమమని వివరించారు. ప్రస్తుతం యూఐపీ కింద 11 టీకాల ద్వారా 12 వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తున్నారు. ఇందులో సీఆర్ఐ గణనీయమైన పాత్ర పోషించిందని చెప్పారు. ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 2–2.5 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారని, అంతే సంఖ్యలో మహిళలు గర్భవతులవుతారని తెలిపారు. గర్భధారణ నమోదైనప్పటి నుంచి యూ-విన్ వంటి డిజిటల్ వేదికల ద్వారా లబ్ధిదారులను ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. గర్భిణులకు కనీసం ఐదు యాంటీనాటల్ చెకప్‌లు, అందులో ఒకటి నిపుణుడి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిశువు 16 ఏళ్ల వయస్సు చేరే వరకు 27 డోసులతో కూడిన టీకా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం దాదాపు 5 కోట్ల మంది లబ్ధిదారులు, 2.5 కోట్ల గర్భిణీలు, 2.5 కోట్ల పిల్లలు ఈ కార్యక్రమం కింద రక్షణ పొందుతున్నారని తెలిపారు. వ్యవస్థబద్ధమైన ట్రాకింగ్, నిరంతర టీకా కార్యక్రమాల ఫలితంగా దేశంలో వ్యాక్సిన్ కవరేజ్ దాదాపు 99 శాతానికి చేరుకుందని మంత్రి నడ్డా వెల్లడించారు.
