Let's talk: editor@tmv.in
ప్రపంచ ఏఐ హబ్‌గా విశాఖపట్నం: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన

ప్రపంచ ఏఐ హబ్‌గా విశాఖపట్నం: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన

Dantu Vijaya Lakshmi Prasanna
20 ఫిబ్రవరి, 2026

కృత్రిమ మేధ అనేది మన జీవితకాలంలోనే చూస్తున్న అతిపెద్ద సాంకేతిక మార్పు అని, ఇది మానవాళి అభివృద్ధిలో కొత్త శకాన్ని సృష్టిస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న 'ఏఐ -ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్' నాలుగో రోజున ఆయన మాట్లాడుతూ, భారతదేశం గ్లోబల్ ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోందని కొనియాడారు.

వైజాగ్ ప్రయాణం నుంచి ఏఐ హబ్ వరకు

పిచాయ్ తన విద్యార్థి రోజుల్లో చెన్నై నుండి ఖరగ్‌పూర్ వెళ్లేటప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం మీదుగా వెళ్ళిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు ప్రశాంతమైన తీర ప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం, నేడు ప్రపంచస్థాయి ఏఐ కేంద్రంగా రూపాంతరం చెందడం అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు.

రూ.1.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడి

భారతదేశంలో గూగుల్ చేపట్టిన 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా విశాఖపట్నంలో 'ఫుల్-స్టాక్ ఏఐ హబ్‌'ను ఏర్పాటు చేస్తున్నట్లు పిచాయ్ ప్రకటించారు. ఈ కేంద్రం పూర్తయితే భారత్ అంతటా అత్యాధునిక ఏఐ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

వైజాగ్‌లో ఏర్పాటు చేయబోయే ఈ హబ్‌లో గిగావాట్-స్థాయి కంప్యూటింగ్ శక్తితో పాటు అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వే కూడా ఉంటుంది. ఇది భారతదేశ డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా, వేల సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు వరం

ఏఐ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక గొప్ప అవకాశమని, ఇది పాత తరం సాంకేతిక లోపాలను అధిగమించి వేగంగా పురోగమించడానికి తోడ్పడుతుందని పిచాయ్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రయోజనం దానంతట అది రాదని, బాధ్యతాయుతమైన కృషి అవసరమని స్పష్టం చేశారు.

ఏఐ కేవలం చాటింగ్ లేదా ఇంటర్నెట్ సెర్చ్‌కే పరిమితం కాదని, ఇది శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేస్తుందని ఆయన చెప్పారు. 50 ఏళ్లుగా సైన్స్‌లో ఒక సవాలుగా ఉన్న ప్రోటీన్ స్ట్రక్చర్‌లను అంచనా వేసే 'ఆల్ఫాఫోల్డ్' ఆవిష్కరణ ఏఐ వల్లే సాధ్యమైందని, దీనికి నోబెల్ బహుమతి కూడా లభించిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది పరిశోధకులు మలేరియా వ్యాక్సిన్లు, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి గూగుల్ ఏఐ డేటాబేస్‌ను ఉపయోగిస్తున్నారని పిచాయ్ వెల్లడించారు. భవిష్యత్తులో డిఎన్ఏ వ్యాధులను గుర్తించడంలోనూ ఏఐ కీలకం కానుందని తెలిపారు.

అందరికీ అందుబాటులో సాంకేతికత:

సాంకేతికత కేవలం కొందరికే పరిమితం కాకుండా, మారుమూల ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని పిచాయ్ పిలుపునిచ్చారు. ఏఐ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే గూగుల్ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగానే భారత్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నామని ఆయన ముగించారు.

గూగుల్ భారీ ప్రణాళికలను వివరించిన పిచాయ్

అంతకుముందు, న్యూఢిల్లీలో జరిగిన గూగుల్ కార్యక్రమంలో పిచాయ్ మాట్లాడుతూ, "మన జీవితకాలంలోనే ఏఐ అనేది అతిపెద్ద ప్లాట్‌ఫారమ్ షిఫ్ట్" అని పేర్కొన్నారు. భారీ స్థాయి సవాళ్లను పరిష్కరించే సామర్థ్యం ఏఐకి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

భారతదేశం కృత్రిమ మేధ రంగంలో "అసాధారణమైన పథంలో" పయనిస్తోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. దేశపు ఏఐ పరివర్తనలో భాగస్వామిగా ఉండాలనే కంపెనీ నిర్ణయాన్ని ఆయన పునరుద్ఘాటించారు.