Let's talk: editor@tmv.in
ప్రపంచ ఆవిష్కరణల రాజధానిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ ఆవిష్కరణల రాజధానిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
11 జనవరి, 2026

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బిట్స్ పిలానీ–హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బిట్స్ అల్యూమ్నీ అసోసియేషన్ గ్లోబల్ మీట్ 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ), పరిశోధన ఆధారిత ఆవిష్కరణలు, నైతిక సాంకేతికతను కేంద్రబిందువుగా చేసుకుని బలమైన గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోందని మంత్రి తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రారంభించిన తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ భారతదేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా మార్పిడి వేదికగా నిలిచిందని చెప్పారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు అవసరమైన డేటాను సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోందన్నారు.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఏఐ ఇన్నోవేషన్ హబ్తో పాటు ప్రత్యేక ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ సంస్థల ద్వారా పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ సంస్కృతి మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం సాంకేతిక పురోగతికే కాకుండా, సమాజానికి మేలు చేసే బాధ్యతాయుత ఏఐ అవసరమని, డేటా గోప్యత, సైబర్ భద్రత, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

గ్రామీణ రంగాలు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో సాంకేతికత ప్రయోజనాలు అందేలా సమగ్ర పరిష్కారాలు రూపొందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా మంత్రి తెలిపారు. ఆవిష్కరణలు కొద్ది మందికే పరిమితం కాకుండా సమాజం మొత్తానికి ఉపయోగపడాలని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగస్వాములవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిట్స్ అలుమ్నీలను శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. దేశాభివృద్ధికి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు సాంకేతికత కీలక పాత్ర పోషించాలని, తెలంగాణ ఆ దిశగా ముందడుగు వేస్తోందని మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.