
ప్రపంచానికి వినిపించని ‘క్యూబా’ ఆర్తనాదాలు
కరీబియన్ సముద్ర తీరాన ఉన్న ఓ చిన్న ద్వీప దేశం క్యూబా నేడు తీవ్రమైన ఆర్థిక–సామాజిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సుమారు కోటికి పైగా జనాభా కలిగిన ఈ దేశంలో ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో సాధారణ జీవితం సైతం కష్టసాధ్యంగా మారింది. రోజువారీ అవసరాల కోసం గంటల కొద్దీ క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి, తరచూ విద్యుత్ కోతలు, పెరుగుతున్న ధరలు ఇవి అక్కడి ప్రజల దైనందిన వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో పెద్దగా వినిపించని ఈ దేశం నేడు మౌనంగా ఒక పెద్ద మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఒకప్పుడు క్యూబా లాటిన్ అమెరికాలో సామాజిక రంగాల్లో ముందంజలో ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఉచిత వైద్యం, విద్య వంటి సేవలతో ప్రజలకు భద్రత కల్పించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వరకూ ఆరోగ్య సేవలు విస్తరించడంతో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచింది. పూర్వంలో సోవియట్ యూనియన్ నుంచి లభించిన ఆర్థిక సహాయం దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే సోవియట్ యూనియన్ పతనంతో ఆ సహాయం ఆగిపోవడం క్యూబా ఆర్థిక వ్యవస్థకు మొదటి పెద్ద దెబ్బగా మారింది. అప్పటి నుంచి దేశం నిరంతర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంది. అలాగే అమెరికా వెనిజువెలాను గుప్పిట్లోకి తీసుకోవడంతో అక్కడి నుంచి లభించే సహయం కూడా ఆగిపోవడం ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఇది సంక్షోభం కాదు… నెమ్మదిగా జరుగుతున్న హత్య
ఈ సంక్షోభంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అంశాల్లో ఒకటి అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు. 1960ల నుంచి కొనసాగుతున్న ఈ నిర్బంధం వల్ల క్యూబా అంతర్జాతీయ వాణిజ్యంలో వెనుకబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సాధారణ మహిళ రాసిన ఓపెన్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. క్యూబాలో జరుగుతున్నది సాధారణ ‘సంక్షోభం’ కాదని, ఇది నెమ్మదిగా జరుగుతున్న ‘హత్య’ అని ఆమె తీవ్రంగా ఆరోపించింది. ముఖ్యంగా అమెరికా ఆంక్షలే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. వృద్ధులకు అవసరమైన గుండె, రక్తపోటు, మధుమేహ మందులు అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మందులు సరఫరా చేయాలనుకునే కంపెనీలను ఆంక్షలతో అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది.
శిశువుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని ఆమె పేర్కొంది. ఇంధన కొరత కారణంగా కొన్ని ఆసుపత్రుల్లో ఇన్క్యూబేటర్లను ఆపాల్సి వచ్చిన ఘటనలను ప్రస్తావిస్తూ, చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయ సమాజం స్పందించడం లేదని ఆమె ప్రశ్నించింది. ఆహార కొరత కూడా సహజ కారణం కాదని, విదేశీ కొనుగోళ్లపై నిర్బంధం వల్లే ఆకలి సమస్య పెరిగిందని ఆరోపించింది. బ్యాంకింగ్ లావాదేవీలను అడ్డుకోవడం, సరుకు రవాణాపై ఒత్తిడి తేవడం వంటి చర్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయని పేర్కొంది.
ఆరోగ్య రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. కరోనా సమయంలో ప్రపంచానికి సేవలందించిన క్యూబా వైద్యులు ఇప్పుడు సిరింజీలు, అనస్థీషియా, ఎక్స్‌రే పరికరాల కొరతతో పనిచేయాల్సి వస్తోందని ఆమె పేర్కొంది. అయినప్పటికీ క్యూబా శాస్త్రవేత్తలు ఐదు కోవిడ్ వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడం దేశ సామర్థ్యాన్ని చూపిస్తుందని గుర్తుచేసింది. ఇంకా ఒక ఆందోళనకర అంశం జనాభా పరిస్థితి. సుమారు 1.08 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వలసలు భారీగా పెరిగాయి. యువత విదేశాలకు వెళ్లిపోవడం వల్ల పని దళం తగ్గుతోంది. జననాల రేటు పడిపోవడంతో వృద్ధుల శాతం పెరుగుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆ మహిళ చేసిన విజ్ఞప్తి గుండెను కలిచివేసేలా ఉంది. క్యూబా దానం కోరడం లేదని, న్యాయం మాత్రమే కోరుతోందని ఆమె స్పష్టం చేసింది. క్యూబా ప్రజల బాధను సాధారణంగా చూడకూడదని, ఈ ఆంక్షలను “మానవత్వానికి వ్యతిరేక నేరం”గా గుర్తించాలని కోరింది. ప్రస్తుతం క్యూబా పరిస్థితి అనేక కారకాల కలయికతో ఏర్పడిన సంక్షోభంగా మారింది. ఆర్థిక ఆంక్షలు, ఇంధన కొరత, దిగుమతులపై ఆధారపడటం, ద్రవ్యోల్బణం, జనాభా మార్పులు అన్నీ కలిసి దేశాన్ని కుదేలు చేస్తున్నాయి. డాలర్ లావాదేవీలు కష్టతరమయ్యాయి. ఔషధాలు, యంత్రాలు, ఇంధనం వంటి కీలక వస్తువులను దిగుమతి చేసుకోవడంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే క్యూబా సమస్యలు పూర్తిగా ఆంక్షల వల్లనే వచ్చాయని చెప్పడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. అంతర్గత ఆర్థిక విధానాల్లో లోపాలు, పరిమిత ఉత్పత్తి సామర్థ్యం, విదేశీ మారక నిల్వల కొరత కూడా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
ఇంధన సమస్య కూడా దేశాన్ని గట్టిగా దెబ్బతీస్తోంది. క్యూబా ఇంధన అవసరాల కోసం ప్రధానంగా వెనిజువేలాపై ఆధారపడింది. కానీ అక్కడి ఆర్థిక సంక్షోభం కారణంగా సరఫరా తగ్గిపోవడంతో క్యూబాలో విద్యుత్ ఉత్పత్తి దెబ్బతింది. ఫలితంగా రోజూ గంటల తరబడి పవర్ కట్‌లు, పరిశ్రమల మూతపడటం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తీవ్రంగా మారాయి. ఇంధనం లేదు, ఔషధాలు లేవు, ఆకలి వంటి బోర్డులు ప్రజల అసహనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కూడా ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోంది. ఈ స్థితి నుంచి బయటపడటానికి అంతర్గత సంస్కరణలతో పాటు అంతర్జాతీయ సహకారం కూడా అత్యవసరం. లేకపోతే ప్రపంచానికి వినిపించని ఈ ‘క్యూబా ఆర్తనాదాలు’ ఇంకా చాలా కాలం ప్రతిధ్వనిస్తూనే ఉండే ప్రమాదం ఉంది.
ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ క్యూబా వివాదం
డొనాల్డ్ ట్రంప్ ఇటీవల క్యూబాపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. క్యూబాను ‘తీసుకుంటాం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈనెల 16న ఇరాన్ యుద్ధంపై మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ ‘క్యూబాను ఏ రూపంలోనైనా తీసుకునే గౌరవం నాకు దక్కుతుందని భావిస్తున్నాను..దాని విషయంలో నేను ఏదైనా చేయగలను’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలతో పోరాడుతున్న పరిస్థితుల్లో చేయడం గమనార్హం. అమెరికా విధించిన ఆంక్షలు, ముఖ్యంగా ఆయిల్ సరఫరాపై పరిమితులు, క్యూబాలో ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు, ఉత్పత్తి అంతరాయం, రవాణా సమస్యలు పెరిగాయి. ట్రంప్ మరోసారి క్యూబాను బలహీన దేశంగా అభివర్ణిస్తూ, అక్కడ ప్రభుత్వ మార్పు సాధ్యమనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఫ్రెండ్లీ టేకోవర్ కూడా సాధ్యమని చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై క్యూబా తీవ్రంగా స్పందించింది. అమెరికా జోక్యాన్ని ఖండిస్తూ, తమ దేశ సార్వభౌమాధికారంపై ఎలాంటి రాజీ ఉండదని క్యూబా విదేశాంగ వర్గాలు స్పష్టం చేశాయి. అవసరమైతే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించాయి.
