Let's talk: editor@tmv.in
ప్రపంచస్థాయి నగరాల్లా ఫ్యూచర్ సిటీ

ప్రపంచస్థాయి నగరాల్లా ఫ్యూచర్ సిటీ

Aravind Maryada Reddy
29 సెప్టెంబర్, 2025

ఫ్యూచర్ సిటీని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. న్యూయార్క్, దుబాయ్, సింగపూర్ వంటి నగరాలకు దీటుగా దీన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. ఫ్యూచర్ సిటీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండపడ్డారు. ఈ సిటీ కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే నిర్మిస్తున్నామన్నారు. ఎవరికో మేలు చేసేందుకు ఈ నగరాన్ని నిర్మించడం లేదని స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హైదరాబాద్ కోసం ఎంతో చేశారని చెప్పుకొచ్చారు. ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డేవలప్ మెంట్ అథారిటీ భవనం, 45 కిలో మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ తెలంగాణ గొప్ప భవితకు పునాది రాయి అని పేర్కొన్నారు. రేపటి తెలంగాణను ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చే బృహత్తర ప్రయత్నమన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం, భూములు త్యాగం చేసిన రైతుల గొప్ప మనస్సు కలిసి ఈ మహానగరం ఆవిష్కృతం అవుతుందన్నారు. ప్రపంచ నాగరికత చరిత్రకు మహానగరాలే తార్కాణాలు.

తప్పుడు ప్రచారం

ఫ్యూచర్‌ సిటీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తనకు ఇక్కడ భూములున్నందు వల్లే ఫ్యూచర్‌ సిటీ కడుతున్నారని అంటున్నారని పేర్కొన్నారు. తన కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్‌ సిటీ అని వివరించారు. చంద్రబాబు, వైఎస్సార్ కృషి వల్లే హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ వచ్చాయని చెప్పారు.

‘‘70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఏం తక్కువ? అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చెన్నైకి బుల్లెట్‌ ట్రైన్‌(వయా అమరావతి)కి కేంద్రం ఒప్పుకొంది. ఇక్కడ 500 ఫార్చ్యూన్‌ కంపెనీలు కొలువు తీరాలన్నది నా స్వప్నం. హైదరాబాద్‌లో ప్రస్తుతం 80 ఫార్చ్యూన్‌ కంపెనీలే ఉన్నాయి. దక్షిణ భారతంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అందుకే ఫ్యూచర్‌ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంచి సంకల్పంతో తలపెట్టిన ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవానికి వరుణదేవుడు కూడా సహకరించాడు. ఆనాడు కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు. నిజాం కాలంలో సికింద్రాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ అభివృద్ధి జరిగింది. గతం నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

మా లక్ష్యం ఇదే..

అందరి సహకారంతో రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని చెప్పారు. ఇందుకు మీ అందరి సహకారం ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్వాసితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. కానీ రాజకీయ పార్టీల నేతల ఉచ్చులో పడి కోర్టుకు వెళ్లి సమస్యలు సృష్టించవద్దని సూచించారు. తక్షణమే నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ‘అందరికీ న్యాయం చేయాలనేదే మా ప్రయత్నం. డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ భవనం, స్కిల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం. అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాం. ప్రపంచంలో ఎవరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడుతా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడ పది ఎకరాలు కేటాయించాలని మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకు సూచన చేస్తున్నాను. 2026 డిసెంబర్‌లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసుకునేలా చూడాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రపంచస్థాయి నగరాల్లా ఫ్యూచర్ సిటీ - Tholi Paluku