Let's talk: editor@tmv.in
ప్రపంచవ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

Gaddamidi Naveen
18 ఫిబ్రవరి, 2026

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం తన 72వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలలోని పలువురు ప్రముఖ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు, గల్ఫ్ దేశాల నుంచి యూరప్, ఆఫ్రికా వరకు ఉన్న బీఆర్ఎస్ ఎన్నారైలు సేవా కార్యక్రమాలు చేపట్టి జన్మదినాన్ని ప్రత్యేకంగా మార్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేసీఆర్‌కు ఎక్స్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, అలాగే, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ తన అభినందనలు తెలిపారు.

తెలంగాణ భవన్‌లో అగ్రనేతల సందడి

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం (తెలంగాణ భవన్)లో పార్టీ నాయకులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత సందేశాన్ని ఇచ్చారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సేవలు అందించిన సంగతి తెలిసిందే.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి తదితరులు హాజరై కేక్ కట్ చేశారు. హరీష్ రావు భావోద్వేగ ప్రసంగం.. తెలంగాణ జైత్రయాత్ర లేదా నా శవయాత్ర అని చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. నిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతున్నప్పుడు కూడా దీక్ష విరమించనని చెప్పిన ఆయన మొండి ధైర్యమే నేడు మన తెలంగాణ. కేసీఆర్ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచే నాయకుడు అని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో కోలాహలం

బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్బోర్న్, అడిలైడ్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్‌, గోల్డ్ కోస్ట్ వంటి ప్రధాన నగరాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కేసీఆర్ దీర్ఘాయుష్షును కోరుతూ ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహించారు. సిడ్నీలో రాజేష్ గిరి రాపోలు, వినయ్ గౌడ్ సన్నీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన కార్యక్రమం చేపట్టారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అని ఎన్నారైలు ఆకాంక్షించారు.

వినూత్న రీతిలో శుభాకాంక్షలు

కేసీఆర్ జన్మదినం సందర్భంగా సుందరవనాల్లో ప్రాంతంలోని గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా డెల్టాలో 20 వేల మంగ్రోవ్ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కట్టుబాటును చాటారు. ప్రకృతిని రక్షించండి – భవిష్యత్తును భద్రపరచండి అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో శేరిలింగంపల్లి నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.

బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో అమెరికా, యూరోప్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలలో వేడుకలు మిన్నంటాయి. యూఎస్‌ఏ చైర్మన్ మహేష్ తన్నీరు రూపొందించిన 'రావయ్యా ఓ సారు.. మా కేసీఆరు' అనే ప్రత్యేక పాటను హరీష్ రావు ఆవిష్కరించారు. సాయిరాజ్ భూట్ల ఈ పాటను రచించి, సంగీతం అందించారు. మొత్తంగా, కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఖండాతరాలను దాటి, ఆయనపై ఉన్న అచంచలమైన అభిమానాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటిచెప్పాయి.