
ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: ప్రధాని మోడీ
తరతరాల సంస్కరణలతో భారత అభివృద్ధి వేగం మరింత పెరిగిందని, అందుకే ప్రపంచం భారత్ వైపు ఆశతో, విశ్వాసంతో చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వ్యాపారం, ఉపాధి రంగాలకు కేంద్రీకృతమైన సోషల్ నెట్‌వర్కింగ్ వేదిక లింక్డ్‌ఇన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజల సృజనాత్మకత, యువత శక్తి, అజేయమైన ఆత్మవిశ్వాసమే ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’కు ప్రధాన ఇంజిన్ అని ఆయన తెలిపారు. భారత్ సంస్కరణల బాటలో దూసుకెళ్తోంది. ఈ ప్రయాణంలో ప్రపంచం మొత్తం మనవైపు దృష్టి సారిస్తోంది అని పేర్కొన్నారు.
2025 – సంస్కరణల జాతీయ మిషన్ సంవత్సరం
గత 11 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఆధారంగా చేసుకొని, 2025 సంవత్సరం సంస్కరణలను నిరంతర జాతీయ మిషన్‌గా ముందుకు తీసుకెళ్లిన ఏడాదిగా గుర్తుండిపోతుందని మోడీ అన్నారు. సంస్థల ఆధునీకరణ, పాలన సరళీకరణ, దీర్ఘకాలిక సమగ్ర వృద్ధికి పునాదులు బలోపేతం చేశామని తెలిపారు.
జీఎస్టీ, ఆదాయపు పన్ను సంస్కరణలు
జీఎస్టీలో 5 శాతం, 18 శాతం మాత్రమే ఉండే రెండు-స్లాబ్ విధానం అమలుతో గృహాలు, ఎంఎస్ఎంఈలు, రైతులు, శ్రమాధారిత రంగాలపై భారం తగ్గిందన్నారు. దీనివల్ల వినియోగదారుల విశ్వాసం పెరిగి, పండుగల సీజన్‌లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మధ్యతరగతికి అపూర్వ ఉపశమనం కలిగేలా ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించామని చెప్పారు. పాత 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఆధునిక ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్–2025 అమలులోకి వచ్చిందన్నారు.
వ్యాపారాలు, పెట్టుబడులకు ఊతం
చిన్న కంపెనీల నిర్వచనాన్ని విస్తరించి, రూ.100 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న సంస్థలను ఇందులో చేర్చడం వల్ల వేలాది కంపెనీలకు నియమాలను అనుసరించే భారం తగ్గుతుందని తెలిపారు. బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఇవ్వడం ద్వారా బీమా వ్యాప్తి, సేవల నాణ్యత పెరుగుతుందన్నారు.
నౌకాశ్రయ, కార్మిక సంస్కరణలు
ఒకే పార్లమెంట్ సమావేశంలో ఐదు కీలక సముద్ర చట్టాలు ఆమోదం పొందడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, వివాద పరిష్కారం సులభమైందన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు ఆధునిక కార్మిక కోడ్‌లుగా విలీనం చేయడం ద్వారా కార్మికుల హక్కులు కాపాడుతూ, వ్యాపార వాతావరణం మెరుగుపడిందన్నారు. అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ పరిధి విస్తరించడంతో అధికారిక ఉపాధి కవరేజ్ పెరిగిందని చెప్పారు.
వాణిజ్య ఒప్పందాలు, గ్రామీణ ఉపాధి
న్యూజిలాండ్, ఒమన్, బ్రిటన్‌తో పాటు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందాలు పెట్టుబడులు, ఉద్యోగ సృష్టికి దోహదం చేస్తాయని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాలను 100 నుంచి 125కి పెంచుతూ వికసిత్ భారత్–గ్రామ్ జీ యాక్ట్, 2025 అమలు చేశామని పేర్కొన్నారు.
వికసిత భారత్ లక్ష్యం
ఈ సంస్కరణలన్నీ ప్రజల గౌరవప్రదమైన జీవితం, వ్యాపారాల విశ్వాసం, పారదర్శక పాలన లక్ష్యంగా రూపుదిద్దుకున్నవేనని ప్రధాని అన్నారు. నియంత్రణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి విశ్వాస ఆధారిత వ్యవస్థ వైపు భారత్ అడుగులు వేస్తోందన్నారు. వికసిత్ భారత్‌నే మా అభివృద్ధి ధృవతార. భారత్ వృద్ధి కథనంపై విశ్వాసం ఉంచి, మన ప్రజలపై పెట్టుబడులు పెట్టాలని ప్రపంచానికి నేను పిలుపునిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.
