Let's talk: editor@tmv.in
ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం: నిర్మల సీతారామన్

ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం: నిర్మల సీతారామన్

Panthagani Anusha
29 డిసెంబర్, 2025

వ్యక్తిగత వికాసానికి, సమాజ ఉన్నతికి విద్యే అత్యంత బలమైన పునాది. విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా సృజనాత్మక ఆలోచనలతో స్వయం శక్తిని పెంపొందించుకోవాలి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆదివారం పీఎం లంక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.18 లక్షల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ సహా పలు మౌలిక వసతులను ఆమె ప్రారంభించారు.

తీరప్రాంత యువతకు భరోసా

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ.. విద్య ద్వారానే సమాజం శక్తివంతమవుతాయని ఆకాంక్షించారు. ముఖ్యంగా తీరప్రాంత యువత వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఉన్నత విద్యను అభ్యసించాలని వారి ఎదుగుదలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి దేశ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు.

నైపుణ్యాభివృద్ధితోనే ఉపాధి

ప్రధానమంత్రి దత్తత గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి తెలిపారు. పీఎం లంకలో కొనసాగుతున్న 'పీఎం విశ్వకర్మ యోజన' శిక్షణ కేంద్రం ద్వారా యువతకు ఉపాధి మార్గాలు మెరుగయ్యాయని చెప్పారు. 13 రకాల వృత్తుల్లో శిక్షణ పొందిన స్థానిక యువత ప్రస్తుతం హైదరాబాద్, శ్రీ సిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరపడటం శుభపరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యువతకు డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్ వంటి ఆధునిక అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

గ్రామంతో విడదీయరాని అనుబంధం

పెదమైనవాని లంక పరిసర గ్రామ ప్రజలతో తనకు ఉన్న దీర్ఘకాలిక అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. "గోదావరి చెంతనే ఉన్నా, ఇక్కడి ప్రజలు ఉప్పునీటి కారణంగా తాగునీటి ఇబ్బందులు పడటం చూశాను. అందుకే రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తెచ్చాం అని తెలిపారు.

తీర సంరక్షణ.. మత్స్యకారులకు అండ

సముద్ర తీరక్షయాన్ని నివారించేందుకు శాస్త్రీయ పద్ధతిలో రక్షణ చర్యలు చేపడుతున్నామని ఈ పనులు 2026 సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. అదేవిదంగా మత్స్యకారుల జీవనోపాధి కోసం పడవలు, ఇతర ప్రభుత్వ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ దీది, లఖపతి దీది వంటి పథకాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని విద్య, నైపుణ్యం, ఉపాధి కలయికతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసి రాజు, డియస్పి డా.జి.శ్రీవేద, యూనియన్ బ్యాంకు యండి ఆశీస్ పాండే, యస్ యల్ బిసి సి.వి.యన్.భాస్కర్, రీజనల్ హెడ్ మన్యం, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, నరసాపురం టీడీపీ ఇంచార్చి పొత్తూరి రామరాజు, జిల్లా బిజెపి అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, కేంద్ర మంత్రి ప్రతినిధి పేరాల మోహన్, బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచి కొల్లాటి కనకదుర్గ, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సి.హెచ్. నరసింహాస్వామి, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని,విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం: నిర్మల సీతారామన్ - Tholi Paluku