Let's talk: editor@tmv.in
ప్రపంచంలో భారత్‌పై సానుకూల దృక్పథం పెరిగింది: జైశంకర్

ప్రపంచంలో భారత్‌పై సానుకూల దృక్పథం పెరిగింది: జైశంకర్

Pinjari Chand
21 డిసెంబర్, 2025

ప్రపంచం ఈ రోజు గతంతో పోలిస్తే భారతదేశాన్ని ఎక్కువ సానుకూలంగా, గంభీరంగా చూస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. దేశ జాతీయ బ్రాండ్‌ బలపడటం, భారతీయుల వ్యక్తిగత ప్రతిభకు పెరిగిన గుర్తింపు ఇందుకు ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు.పుణేలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్‌డ్) యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక–రాజకీయ శక్తి సమీకరణాలు గణనీయంగా మారాయని పేర్కొన్నారు. ఈ రోజు ప్రపంచంలో అనేక శక్తికేంద్రాలు ఏర్పడ్డాయి. ఎంత శక్తివంతమైన దేశమైనా అన్ని అంశాలపై తన ఇష్టాన్ని రుద్దలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.

భారతదేశంపై ప్రపంచ దృష్టికోణం ఎలా ఉందన్న ప్రశ్నకు సమాధానంగా, ఇప్పటి భారత్‌ను ప్రపంచం మరింత గౌరవంతో చూస్తోంది. ఇది మన జాతీయ బ్రాండ్‌ బలపడటం, భారతీయుల ఖ్యాతి పెరగడమే కారణమని జైశంకర్‌ తెలిపారు. భారతీయులను ప్రపంచం బలమైన పని పట్ల నైతికత కలిగి ఉన్న వారిగా, సాంకేతిక నైపుణ్యాలు గలవారిగా, కుటుంబ విలువలను పాటించే సమాజంగా గుర్తిస్తోందని ఆయన అన్నారు. విదేశాల్లో చర్చల్లో భారత డయాస్పోరాపై ప్రశంసలే వినిపిస్తున్నాయని చెప్పారు.

భారతదేశంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ మెరుగుపడటంతో, భారత్‌పై ఉన్న పాత స్టీరియోటైప్స్‌ క్రమంగా కనుమరుగవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇంకా చాలా సాధించాల్సి ఉన్నా, భారత్‌ ప్రతిఛాయలో వచ్చిన మార్పు మాత్రం వాస్తవం అని స్పష్టం చేశారు. దేశంలో గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు పెరగడం, భారతీయ ప్రతిభకు విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌, వ్యక్తిగత విజయాలు ఈ మార్పుకు నిదర్శనాలని తెలిపారు. భారత్‌ ఈ రోజు ముఖ్యంగా తన ప్రతిభ, నైపుణ్యాలతోనే నిర్వచించబడుతోందని అన్నారు.

మానవ వనరులే ప్రత్యేకత

భారతీయులు ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువ ఆత్మవిశ్వాసంతో, సామర్థ్యంతో ఎదుర్కొంటున్నారని జై శంకర్‌ చెప్పారు. చాలా దేశాలు వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా ప్రపంచంలో తమ ఉనికిని చాటగా, భారత్‌ ప్రత్యేకత మాత్రం మానవ వనరుల ప్రాధాన్యతలో ఉందన్నారు. తయారీ రంగం–సేవారంగం మధ్య చర్చను ప్రస్తావిస్తూ, ఇవి పరస్పర అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఆధునిక తయారీ రంగం అవసరం. అదే సేవారంగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని వివరించారు.

భవిష్యత్తులో భారత్‌కు ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలతో పాటు ఉపాధ్యాయులు, పరిశోధకులు, చరిత్రకారులు, కళాకారులు, క్రీడాకారులు కూడా అవసరమవుతారని అన్నారు. పదేళ్లలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు రెండింతలయ్యాయని గుర్తు చేశారు. ప్రపంచ ఆలోచన విధానాన్ని గ్లోబలైజేషన్‌ మార్చిందని, వలస పాలన అనంతరం దేశాల పురోగతికి నాయకత్వం, విధాన నిర్ణయాల నాణ్యత కీలకమైందని తెలిపారు. ఈ కాలంలో అత్యధికంగా లాభపడిన దేశం చైనా కాగా, భారత్‌ కూడా సంస్కరణల అనంతరం, ముఖ్యంగా గత దశాబ్దంలో గణనీయంగా ఎదిగిందన్నారు.

పాశ్చాత్య దేశాల్లో ఆర్థిక స్థబ్ధత భావన రాజకీయ రంగు పులుముకుంటోందని, ఉత్పత్తిని విదేశాలకు తరలించడం, జీవనశైలి మార్పులు, జనాభా సమస్యలు వారి పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీశాయని జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ఈ అన్ని పరిణామాల ఫలితంగా ప్రపంచ ఆర్థిక, రాజకీయ శక్తి క్రమం గణనీయంగా మారిందని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచంలో భారత్‌పై సానుకూల దృక్పథం పెరిగింది: జైశంకర్ - Tholi Paluku