Let's talk: editor@tmv.in
ప్రపంచంలోనే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విమానాశ్రయాల్లో హైదరాబాద్‌కు 4వ స్థానం

ప్రపంచంలోనే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విమానాశ్రయాల్లో హైదరాబాద్‌కు 4వ స్థానం

Gaddamidi Naveen
14 జులై, 2026

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడర్ ‘AttractionTickets.com’ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది.

సదరు సంస్థ నిర్వహించిన ‘హ్యాపియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్ ర్యాంకింగ్’ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కంటే ఎక్కువ విమానాశ్రయాలను పరిశీలించారు. కుటుంబాలకు అవసరమైన కీలక పారామితుల ఆధారంగా మే 2026లో నిర్వహించిన ఈ డేటా విశ్లేషణలో హైదరాబాద్ విమానాశ్రయం 20 పాయింట్లకు గాను 18.5 స్కోరు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్ రివ్యూ రేటింగ్స్, పిల్లల ఆట స్థలాలు, ఫ్యామిలీ సెక్యూరిటీ లేన్లు, బేబీ-చేంజింగ్ రూములు, ఉచిత స్ట్రోలర్ సేవలు, రెస్ట్ జోన్లు, వై-ఫై నాణ్యత, న్యూరోడైవర్జెంట్ (ప్రత్యేక అవసరాలు గల) ప్రయాణీకులకు అందించే మద్దతు వంటి 9 ముఖ్యమైన అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు.

మారిన ఆధునిక ప్రయాణ అవసరాలకు అనుగుణంగా సేవలు

ఈ మైలురాయిపై జీహెచ్ఐఏఎల్ సీఈఓ కదీర్ కదీరవన్ స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విమానాశ్రయాలలో ఒకటిగా నిలవడం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గర్వకారణం. ఆధునిక ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా, అందరినీ కలుపుకుపోయేలా అత్యుత్తమ సేవలందించేందుకు మేము కట్టుబడి ఉన్నామనడానికి ఈ గుర్తింపు నిదర్శనం అని పేర్కొన్నారు.

కుటుంబాలతో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ విమానాశ్రయం పటిష్టమైన సదుపాయాలను కల్పిస్తోందన్నారు. టెర్మినల్ అంతటా విస్తరించి ఉన్న బేబీ కేర్ రూములు, ఫ్యామిలీ రూములు, ఉచిత బేబీ స్ట్రోలర్లతో పాటు ప్రయాణీకులకు సహాయం చేయడానికి ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీటికి అదనంగా థెరపీ డాగ్స్, యోగా రూమ్, విభిన్నమైన ఆహార విక్రయశాలలు, ఫ్యామిలీ షాపింగ్ స్టోర్లు ఇక్కడి ప్రయాణ అనుభూతిని మరింత మెరుగుపరుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ ర్యాంకింగ్‌లో మొదటి మూడు స్థానాలు ఇలా..

మొదటి స్థానం:

హెల్సింకి-వాంటా విమానాశ్రయం (ఫిన్లాండ్) – స్కోరు 19.4/20

రెండో స్థానం:

సింగపూర్ చాంగి విమానాశ్రయం (సింగపూర్) – స్కోరు 18.7/20

మూడ‌వ‌ స్థానం:

బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం (బహ్రెయిన్), అలాగే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు, భారత్) – స్కోరు 18.6/20

ట్యాగ్‌లు
HyderabadAirportRGIAHyderabadFamilyFriendlyAirportWorldRankingGlobalRecognitionTravelNewsAviationNewsAirportAwardsGHIAL
ప్రపంచంలోనే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విమానాశ్రయాల్లో హైదరాబాద్‌కు 4వ స్థానం - Tholi Paluku