Let's talk: editor@tmv.in
ప్రధాన సమాచార కమిషనర్ గా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం

ప్రధాన సమాచార కమిషనర్ గా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం

Pinjari Chand
16 డిసెంబర్, 2025

మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ గత వారం గోయల్ పేరును సీఐసీగా సిఫారసు చేసింది. గోయల్ 1990 బ్యాచ్ (రిటైర్డ్) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి, అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-యూనియన్ టెరిటరీస్ (ఏజీఎంయూటీ) కేడర్‌కు చెందినవారు. ఆయన ఆగస్టు 31న లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. ఆయన హోమ్ మినిస్ట్రీలో సెక్రటరీ (బార్డర్ మేనేజ్‌మెంట్)గా కూడా పనిచేశారు. అలాగే కేంద్రంలోనూ, గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనూ కీలక పదవులు నిర్వహించారు. రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయం ప్రకారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము గోయల్‌ చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

గతంలో సీఐసీగా పని చేసిన హీరాలాల్ సమరియా పదవి సెప్టెంబర్ 13న పూర్తి కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలోని ప్యానెల్ బుధవారం జరిగిన సమావేశంలో పారదర్శకతా సంస్థ అయిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పేర్లను కూడా సిఫారసు చేసింది.

కొత్తగా ఎంపికైన సీఐసీ, ఇన్ఫార్మేషన్ కమిషనర్ ల చేరికతో తొమ్మిదేళ్లకు పైగా విరామం తర్వాత కమిషన్ పూర్తి స్థాయికి చేరుకుంటుందని ఆర్టీఐ కార్యకర్తలు తెలిపారు.కమిషన్‌కు సీఐసీ నేతృత్వం వహిస్తారు. గరిష్ఠంగా 10 మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఉండవచ్చు. ప్రస్తుతం అనంది రమలింగం, వినోద్ కుమార్ తివారీ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా ఉన్నారు.

కొత్తగా ఎంపికైన కమిషనర్లు

సమాచార కమిషనర్లుగా సిఫార్సు చేసిన వారిలో—

• రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్ జయ వర్మ సిన్హా

• మాజీ ఐపీఎస్ అధికారి స్వగత్ దాస్

• సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అధికారి సంజీవ్ కుమార్ జిందాల్

• మాజీ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ మీనా

• మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి ఖుష్వంత్ సింగ్ సేథి

• సీనియర్ జర్నలిస్టులు పి.ఆర్. రమేష్, ఆశుతోష్ చతుర్వేది

• పీఎన్‌జీఆర్‌బీ సభ్యురాలు (లీగల్) సుధా రాణి రేలంగి ఉన్నారు.

వీరు త్వరలోనే ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సుధా రాణి రేలంగి గతంలో సీబీఐ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా, అలాగే న్యాయ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ, లెజిస్లేటివ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు. సీఐసీ ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పేర్లు మోడీ నేతృత్వంలోని కమిటీలో – కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్న సమావేశంలో ఆమోదించారు.

ప్రధాన సమాచార కమిషనర్‌గా పాత్ర

సమాచార హక్కు చట్టం అమలును పర్యవేక్షిస్తారు, అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాలపై, సమాచార కమిషనర్ల నిర్ణయాలపై తుది అధికారం తీసుకునే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనానికి కీలక బాధ్యత వహిస్తారు.

ప్రధాన సమాచార కమిషనర్ గా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం - Tholi Paluku