Let's talk: editor@tmv.in
ప్రధాన న్యాయమూర్తిపై దాడి - రాజ్యాంగంపై దాడి

ప్రధాన న్యాయమూర్తిపై దాడి - రాజ్యాంగంపై దాడి

Dr.Chokka Lingam
8 అక్టోబర్, 2025

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద షూ విసరడానికి ఓ లాయర్ ప్రయత్నించిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీన్ని ఓ న్యాయమూర్తి మీద షూ విసరడానికి చేసిన ప్రయత్నంలాగా మాత్రమే చూడకూడదని, ప్రజాస్వామ్యానికి నాలుగు మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థపై దాడికి చేసిన యత్నంగానే భావించాలని ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ఓ కేసులో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ దాడికి లాయర్ ప్రయత్నించారని, చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై వ్యక్తిగతంగా జరిగిన దాడిలానే దీన్ని చూడాలని, న్యాయవ్యవస్థకు, దీంతో సంబంధం లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఎవరి వాదనలెలా ఉన్నా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సాక్షాత్తూ సుప్రీంకోర్టులో ఆయన విధుల్లో ఉండగా జరిగిన దాడిని న్యాయవ్యవస్థపై జరిగిన దాడిలాగే చూడాలని ప్రజాస్వామ్యానికి ఇది ఎంత మాత్రం మంచిది కాదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

ఓ ముఖ్యమైన కేసు విచారణ జరుగుతుండగా, రాకేశ్ కిశోర్ అనే 71ఏళ్ల లాయర్ ఒకరు పోడియం వద్దకు వెళ్లి తన షూ తీసి చీఫ్ జస్టిస్‌పై విసిరేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ షూ భారత ప్రధాన న్యాయమూర్తికి తగలకుండా అడ్డుకున్నారు. వెంటనే ఆ లాయర్‌ను అక్కడినుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన తర్వాత చీఫ్ జస్టిస్ హుందాగా స్పందించారు. ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవని, ఎవరూ ఆందోళనకు గురి కావొద్దని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. విచారణ జరుగుతున్న కేసు వాదనలు యథావిధిగా కొనసాగించాలని లాయర్లను కోరారు.

చీఫ్ జస్టిస్‌పై షూ విసరడానికి ప్రయత్నించిన లాయర్ సనాతనధర్మానికి అవమానం కలిగితే భారతదేశం సహించదు అని నినాదాలు చేసినట్టు ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సుప్రీంకోర్టులోని కొందరు లాయర్లు చెప్పారు. దాడికి ప్రయత్నించిన లాయర్‌ బార్ కౌన్సిల్ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించగా, ప్రధాని మోదీ గవాయ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ దాడి దేశంలోని ప్రతి పౌరుడిని ఆగ్రహానికి గురిచేసిందన్నారు.

ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి వార్తల్లో ఉంటున్నారు. దీనికి కారణం విష్ణువుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం. మధ్యప్రదేశ్ ఖజురహోలోని జవారీ ఆలయంలో మొఘలుల కాలంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇటీవల విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 16న కొట్టివేసింది. జవారీ ఆలయం వారసత్వ కట్టడం కావడంతో దానిలో మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో న్యాయమూర్తులు విష్ణువు విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలన్న పిటిషన్ కొట్టివేశారు. విచారణ సమయంలో పిటిషనర్ తరఫు లాయర్ పదే పదే పట్టుబట్టడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది పబ్లిసిటీ కోసం దాఖలు చేసిన పిటిషన్ అని, పిటిషనర్ విష్ణువుకు గొప్ప భక్తుడైతే ఆయనే దేవుణ్ని ప్రార్థించాలని, కొంచెం ధ్యానం చేయాలని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యనించడం తీవ్ర సంచలనం సృష్టించింది. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై హిందూ సంస్థలతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సంయమనంతో మాట్లాడాలని విశ్వ హిందూ పరిషత్ వ్యాఖ్యానించింది. దీంతో తన వ్యాఖ్యలపై తర్వాత చీఫ్ జస్టిస్ వివరణ ఇచ్చారు. తాను అన్నిమతాలను నమ్ముతానని, అన్ని మతాలను గౌరవిస్తానని చీఫ్ జస్టిస్ అన్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణ సమయంలో సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలపై తర్వాత వివరణ ఇచ్చినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. ఈ క్రమంలోనే ఆ లాయర్ చీఫ్ జస్టిస్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించారని భావిస్తున్నారు.

కారణమేదైనప్పటికీ ఈ ఘటనను భావప్రకటనాస్వేచ్ఛపై జరిగిన దాడిగానే చూడాలి. రాజ్యాంగం పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛ ఇచ్చింది. దీనికి ఆటంకం కలిగితే పౌరులు కోర్టులను ఆశ్రయించి రక్షణ పొందే ప్రయత్నం చేశారు. కానీ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కేసు గమనిస్తే ఆయనకే భావ ప్రకటన స్వేచ్ఛ లేదేమో అన్న సందేహం కలగక మానదు. ప్రజాస్వామ్యదేశంగా చెప్పుకునే భారత్‌లో సాక్షాత్తూ దేశ ప్రధాన న్యాయమూర్తికే తాను అనుకున్నది మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఇక సాధారణ పౌరుల సంగతేంటన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. షూ విసిరిన తర్వాత సనాతన ధర్మం గురించి లాయర్ రాకేశ్ కిశోర్ నినాదాలు చేసినట్టు చెబుతున్నారు. అసలా ధర్మం విషయానికేవస్తే...ఏ ధర్మమూ ఇతరులపై దాడులు చేయమని, తోటివారి హక్కులను అడ్డుకోమని చెప్పదు. కానీ సనాతన ధర్మం పేరుతో అలాంటివే జరుగుతున్నాయి.

తమను వ్యతిరేకించేవారిని నోరు తెరవనివ్వకూడదనే పరిస్థితులు ఏర్పడ్డాయి. సనాతన ధర్మం పేరుతో దేశంలో జరుగుతున్న దాడులపై ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇలాంటి ఘటన జరుగుతుందన్నది ఊహకు అందనిది. ఈ దాడిని సమర్థిస్తూ కొందరు మాట్లాడడం ప్రజాస్వామ్యానికి మరింత ఆందోళనకరపరిణామం. భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కేసు విచారణ సందర్భంగా అయినప్పటికీ ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయమూ ఉండొచ్చు. కానీ దాడుల ద్వారా ఆయన్నో, న్యాయవ్యవస్థనో, ఇతరులనో భయపెట్టాలని సనాతనవాదులు అనుకోవడం సరికాదు. ఈ విద్వేషం ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు.

చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ దళితులు. భారత్‌కు ఆయన రెండో దళిత ప్రధాన న్యాయమూర్తి. మహారాష్ట్రకు చెందిన ఆయన రాజకీయ కుటుంబానికి చెందిన వారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. కేరళ, బీహార్ గవర్నర్‌గానూ విధులు నిర్వహించారు. ఈ నేపథ్యం ఉన్న చీఫ్ జస్టిస్‌కు ఆచితూచి మాట్లాడాలన్న విషయం తెలుసు. ఏ వ్యాఖ్యలు ఎలాంటి వివాదాలకు దారితీస్తాయన్న విషయం పైనా అవగాహన ఉంది. అయినప్పటికీ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటే కేసు విచారణ సమయంలో అనుకోకుండా అన్న మాటలుగానే వాటిని చూడాలి తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని భావించాలి. తన వ్యాఖ్యలపై వివాదం తలెత్తిన విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించి వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆయనపై దాడికి లాయర్ ప్రయత్నించారు.

ఈ సమయంలో కేంద్రప్రభుత్వం సరిగ్గా స్పందించాలి. వివాదాన్ని ఇంతటితో ముగించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు ఈ దాడి వల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే భద్రత లేకపోతే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని ప్రజల్లో ఏర్పడిన భయాందోళనను తొలగించే చర్యలు తీసుకోవాలి. కేంద్రప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య విభేదాలున్నట్టుగా కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి ఘటనపై సరైన రీతిలో స్పందించడం ద్వారా ఆ విభేదాలనూ తొలగించుకునే ప్రయత్నమూ కేంద్రం చేయాలి

ప్రధాన న్యాయమూర్తిపై దాడి - రాజ్యాంగంపై దాడి - Tholi Paluku