
ప్రధాన్ రాజీనామా.. 'ఇక దిగాల్సింది ప్రధాని మోడీయే': వైఎస్ షర్మిల
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ రాజీనామా విద్యార్థుల ఐక్య ఉద్యమానికి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి దక్కిన విజయమని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్టులో షర్మిల మాట్లాడుతూ, బెదిరింపులకు జడవకుండా, కేసులకు భయపడకుండా, లాఠీచార్జీలను ఎదుర్కొంటూ, రక్తం చిందించినా వెనక్కి తగ్గకుండా పోరాడిన విద్యార్థులు, యువతకు అభినందనలు తెలిపారు. మంత్రి పదవి నుంచి తప్పుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగించిన ప్రతి విద్యార్థి పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు.
బీజేపీ అహంకారానికి, ప్రశ్నించే గొంతును అణచివేయాలనే ప్రయత్నాలకు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలకు ఇది గట్టి సమాధానమని షర్మిల వ్యాఖ్యానించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా దేశ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని, ఇది బీజేపీ పాలనకు ఎదురుదెబ్బగా నిలిచిందన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా చివరికి యువశక్తి ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందని ఆమె విమర్శించారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే యువత తగిన సమాధానం చెబుతుందని ఈ పరిణామం మరోసారి నిరూపించిందన్నారు.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, విద్యార్థుల హక్కుల రక్షణ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి నిరంతర పోరాటం కొనసాగిస్తుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అలాగే "ధర్మేంద్ర ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని నరేంద్ర మోడీయే" అని తన పోస్టులో పేర్కొన్నారు.
