Let's talk: editor@tmv.in
ప్రధాని ‘మౌనీబాబా’ అవతారమెత్తారు: కాంగ్రెస్ నేత జైరాం రమేష్

ప్రధాని ‘మౌనీబాబా’ అవతారమెత్తారు: కాంగ్రెస్ నేత జైరాం రమేష్

Pinjari Chand
19 అక్టోబర్, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రష్యా ముడి చమురు విషయంలో ప్రధాని మౌనీబాబా అవతారమెత్తారని జైరాం రమేష్ విమర్శించారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ప్రాంతాల గురించి మాట్లాడే ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై మాట్లాడటం లేదని ఆరోపించారు. ట్రంప్ ఇప్పటివరకు రష్యాచమురును ఇండియా కొనడం లేదని పదేపదే మీడియా సమావేశాల్లో చెబుతున్నా ప్రధాని మౌనం ఎందుకు వీడటం లేదు? అన్ని దేశాలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రవచనాలు చెప్పే నాయకుడు తన స్నేహితుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని అడిగారు.

జైరాం రమేష్ తన ఎక్స్​ లో ఇలా పోస్ట్​ చేశారు. ట్రంప్ మళ్లీ, మళ్లీ చెబుతున్నాడు తన స్నేహితుడు, భారత ప్రధాని రష్యా చమురు దిగుమతులు తగ్గిస్తామని హామీ ఇచ్చాడని. ‘ఆపరేషన్ సింధూర్ ’ గురించి ఇప్పటికీ ఆయనే ఆపానంటున్నారు. ప్రతి దేశంలో అదే చెబుతున్నారు. ఆయన పాకిస్ఠాన్ ప్రధాని ఆసీమ్ మునీర్ తో గంటలపాటు ప్రత్యేకంగా సమావేశమవుతారు. వైట్ హౌస్ లో విందులో పాల్గోంటారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ఆహ్వానం రాదు. ఆయన ట్రంప్ తో సమావేశం కారు. అసలేమైంది. ఇప్పుడు ‘భారత్ రష్యా చమురు కొనడం ఆపింది’ అంటున్నప్పుడు కూడా ఆ స్నేహితుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, ప్రధాని మౌనీ బాబా అయిపోయాడన్నారు. అదే సమయంలో భారత్-చైనా వాణిజ్య లోటు 2025 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య $54.4 బిలియన్స్ కు పెరిగిందని రమేష్ గుర్తు చేశారు. (గత సంవత్సరం ఇదే కాలంలో $49.6 బిలియన్).

ట్రంప్ తాజా వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్‌లో జరిగిన భోజన సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురు కొనదు. ఇప్పటికే కొనుగోలు తగ్గించింది, దాదాపు ఆపేసింది అని అన్నారు. వారు గతంలో 38% చమురు రష్యా నుంచి కొన్నారు, ఇక అంతా ఆగిపోతుంది అని కూడా జెలెన్ స్కీకి హామీ ఇచ్చారు.

భారత ప్రభుత్వ స్పందన

ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశం చమురు, గ్యాస్ ప్రధాన దిగుమతి దేశం. మేము ఎప్పుడూ భారత వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికే ప్రాధాన్యం ఇస్తాం. మా దిగుమతి విధానం పూర్తిగా జాతీయ ప్రయోజనాల ఆధారంగా ఉంటుందన్నారు. అమెరికాతో ఇంధన సహకారం దశాబ్ద కాలంగా పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఈ రంగంలో మరింత సహకారం కోరుకుంటోంది అని పేర్కొన్నారు.