Let's talk: editor@tmv.in
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ 'జియు-జిట్సు' బాణం!

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ 'జియు-జిట్సు' బాణం!

Dantu Vijaya Lakshmi Prasanna
21 ఫిబ్రవరి, 2026

భారత్ ,అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని లక్ష్యంగా చేసుకుని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందాన్ని ఆయన కేవలం ఒక వ్యాపార లావాదేవీగా కాకుండా, దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిన "అధమ స్థాయి లొంగుబాటు"గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఒప్పందానికి ఎందుకు తలొగ్గారో వివరిస్తూ, ఆయనపై ఉన్న అంతర్జాతీయ ఒత్తిళ్లను 'జియు-జిట్సు' క్రీడలోని సాంకేతిక పదాలతో పోల్చి సంచలనం సృష్టించారు.

పార్లమెంటులో తాను వాడిన 'జియు-జిట్సు' క్రీడలోని అంశాలను రాహుల్ ఈ సందర్భంగా వివరించారు. మార్షల్ ఆర్ట్స్ అయిన "జియు-జిట్సులో ప్రత్యర్థిని అదుపు చేయడానికి గ్రిప్స్, చోక్స్ ఉపయోగిస్తారు. ఇవి రాజకీయాల్లో కూడా ఉంటాయి, కానీ అవి సామాన్యులకు కనిపించవు. ఉచ్చు ఎక్కడ బిగిస్తున్నారో, పట్టు ఎక్కడ వేస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అర్థం కాదు. మన ప్రధాని ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక, రాజకీయ స్థితిని వివరించడానికే నేను ఈ పదాలను వాడాను," అని ఆయన అన్నారు. మోడీ అందుకే భారత్ ఎంతో ఇచ్చి చాలా తక్కువ పొందేలా ఉన్న ఈ ఏకపక్ష ఒప్పందానికి అంగీకరించాల్సి వచ్చిందని ఆరోపించారు.

ఈ ఒప్పందం వల్ల భారతదేశం భవిష్యత్తులో ఒక "డేటా కాలనీ"గా (సమాచార వలస దేశం) మారుతుందని రాహుల్ హెచ్చరించారు. భారతీయ పౌరుల వ్యక్తిగత, జాతీయ సమాచారాన్ని అతి తక్కువ ధరకే అమెరికన్ కంపెనీలకు ధారాదత్తం చేయడం ద్వారా మన డిజిటల్ సార్వభౌమాధికారాన్ని ప్రధాని పణంగా పెట్టారని ఆయన విమర్శించారు. ఆధునిక కాలంలో డేటా అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానిని అమెరికాకు అప్పగించడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగంపై ఈ ఒప్పంద ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నుండి వచ్చే దిగుమతులను ఏటా 100 బిలియన్ డాలర్ల మేర పెంచడానికి అంగీకరించడం వల్ల భారతీయ రైతులు, వస్త్ర పరిశ్రమ, డైరీ రంగం కుదేలవుతాయని ఆయన పేర్కొన్నారు. కేవలం అమెరికాను సంతోషపెట్టడానికి మన రైతుల ప్రయోజనాలను బలి ఇచ్చారని, ఈ ఒప్పందం వల్ల మన దేశ ఆర్థిక స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని ఆయన ధ్వజమెత్తారు.

ప్రధానిపై ఉన్న ఒత్తిళ్లకు ప్రధాన కారణాలను వివరిస్తూ.. అమెరికాలో అదానీ గ్రూప్‌పై ఉన్న క్రిమినల్ కేసులు, వివాదాస్పద ఎప్‌స్టీన్‌ ఫైళ్లను రాహుల్ ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ' ఎప్‌స్టీన్‌’ కుంభకోణం'లో విడుదల కాని ఆ మూడు మిలియన్ల ఫైళ్లలో హర్దీప్ పూరీ, అనిల్ అంబానీ పేర్లతో పాటు ప్రధాని మోదీ పేరు కూడా ఉండే అవకాశం ఉందని, అందుకే ఆయన భయపడుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఆ భయంతోనే అమెరికా చెప్పినట్లు మోదీ వింటున్నారని ఆరోపించారు. ఒకవైపు సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే విడుదల చేయని పుస్తకంలో ఉన్న సత్యాలను ఆయన ప్రస్తావించారు. మరోవైపు అమెరికా ఒత్తిడి, ఈ రెండు శక్తుల మధ్య ప్రధాని చిక్కుకుపోయారని ఆయన విశ్లేషించారు.

ప్రధాని మోదీ తన కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి నిర్మించుకున్న "బలమైన నాయకుడు" అనే నకిలీ ఇమేజ్‌ను కాపాడుకోవడమే ఇప్పుడు ఆయనకు బలహీనతగా మారిందని రాహుల్ విమర్శించారు. ఆ ఇమేజ్ యొక్క 'కీ' ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉందని, అందుకే భారత ఇంధన భద్రతను, చమురు సరఫరాను అమెరికా శాసించేలా మోదీ అంగీకరించారని అన్నారు. జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టి కుదుర్చుకున్న ఈ వాణిజ్య ఒప్పందం దేశానికి బానిసత్వపు మార్గమని ఆయన హెచ్చరించారు.