
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, హైదరాబాద్‌లోని 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో డిసెంబర్ 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు హాజరు కావాలని ప్రత్యేక ఆహ్వానాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీకి ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ పై వివరణ ఇచ్చారు.నీతీఆయోగ్ మార్గదర్శకత్వంలో, నిపుణుల సూచనలతో సిద్ధమైన ఈ పత్రం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుసంధానంగా రూపొందించబడిందని. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ కీలక పాత్ర పోషించనున్న ప్రణాళికలను కూడా సీఎం వివరించారు.
రాష్ట్రంలోని ప్రతి రంగంలో ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య ఆవిష్కరణల ఆధారంగా తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతున్నదీ ఈ విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టంగా ప్రతిబింబించబడిందని సీఎం మోదీకి వివరించారు. ప్రపంచ పెట్టుబడిదారులు, పరిశ్రమల నాయకులు, ఆవిష్కర్తలు, విధాననిర్మాతలు పాల్గొనబోయే ఈ గ్లోబల్ సమిట్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.దేశ విదేశాల నుంచి ప్రముఖ నేతలు, కార్పొరేట్ ప్రముఖులు, టెక్ దిగ్గజాలు పాల్గొనబోతున్న ఈ సమిట్ తెలంగాణను ‘భారత భవిష్యత్ హబ్’గా నిలిపే అవకాశాలను తెరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానమంత్రిని ఆహ్వానించిన ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకరించాలి
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా, పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. రూ. 43,848 కోట్ల అంచనా వ్యయంతో 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ఈ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఆర్థిక అనుమతులు, అలాగే దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు.రీజినల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఎలివేటెడ్ కారిడార్
రాష్ట్రంలో హైస్పీడ్ కనెక్టివిటీ కోసం కీలకమైన కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి చొరవ చూపాలని సీఎం కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు హై స్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా, నాగర్‌కర్నూల్ టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ సీఎం వినతిపత్రం అందించారు.
అనంతరం కేంద్రమంత్రులు, రాహుల్, ప్రియాంకలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
న్యూ ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ,అలాగే ఎంపీ ప్రియాంక గాంధీలను కలిశారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్,కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లకు ఆహ్వానం అందించారు.ఈ కీలక భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు.
