Let's talk: editor@tmv.in
ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
28 మార్చి, 2026

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా స్థితిగతులను వివరిస్తూ భవిష్యత్తు కార్యాచరణను ప్రధానికి నివేదించారు.

ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కమిటీ నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తోందని వివరించారు.

మొత్తం 33 జిల్లాల్లో గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలు సజావుగా కొనసాగేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు వివరించారు. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యతా క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పెట్రోల్ బంక్‌లో ఉన్న నిల్వలు, వినియోగం వంటి వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో తెలంగాణలో రోజుకు సుమారు 36,189 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,88,210 కిలోలీటర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రధానికి సీఎం తెలియజేశారు.

తప్పుడు ప్రచారాలపై ఉక్కుపాదం

ఇంధన కొరతపై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న అపోహలు, భయాందోళనలు సృష్టించే పోస్టులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. అలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి బంక్‌లో ఉన్న స్టాక్ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారని తెలిపారు.

గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు

అదేవిధంగా, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలను సీఎం ప్రధానికి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, రాష్ట్రంలో ఈవీలపై 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించామని చెప్పారు. ఈవీ తయారీ, బ్యాటరీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న సుమారు 1.20 లక్షల పెట్రోల్, డీజిల్ ఆటోలను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ సేవల్లో కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలు ఇంధన భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడనున్నాయి.