Let's talk: editor@tmv.in
ప్రధాని మోడీపై రాహుల్ విమర్శనాస్త్రాలు

ప్రధాని మోడీపై రాహుల్ విమర్శనాస్త్రాలు

Pinjari Chand
30 అక్టోబర్, 2025

బీహార్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. బీహార్ లో 2024లో జరిగిన నీట్ పేపర్ లీక్‌ ఘటనపై రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా పేపర్లు డబ్బున్నవారికి ముందుగానే చేరుతుంటే, బీహార్‌ యువత పడ్డ శ్రమ అంతా వృథా అవుతోంది. నిజాయితీగా కష్టపడి చదివే విద్యార్థుల ముఖాన ఇది ఒక చెంప దెబ్బ లాంటిదే అని ఆయన మండిపడ్డారు. దర్భంగా నియోజకవర్గంలో బుధవారం జరిగిన మహాఘట్బంధన్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రాహుల్‌గాంధీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఓట్ చోరితో గెలవాలని ప్రయత్నం చేస్తోంది. అలాగే మోడీ తక్కువ ధరలో డాటా ఇస్తున్నామన్నారు. మరి కంపెనీలు ఎవరికి ఇచ్చారు. లాభాలు వారికి ఇచ్చారు. మీరు అంబానీ కోసం స్పెక్ట్రం ఇచ్చిందని ఆరోపించారు. ఎందుకు బీహార్ యువతకు అబద్దాలు చెబుతున్నారు. నితీశ్ కుమార్ ఎప్పుడూ అణగారిన వర్గాల వ్యక్తిగా చెప్పుకుంటారు.అయితే వారి కోసం విద్య, వైద్యం, ఉపాధి కోసం 20 సంవత్సరాల నుంచి ఏం చేశారని ప్రశ్నించారు. నితీశ్ చేతిలో ఏమి లేదు. ఆయనను బీజేపీ కంట్రోల్ చేస్తోంది. రిమోట్ వారి చేతుల్లో ఉంది. ముగ్గురు, నలుగురు ఆయనను కంట్రోల్ చేస్తున్నారు.

పేదల కష్టం వృథా... ధనవంతులకే పరీక్షా పేపర్లు

బీహార్‌ యువత ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు. ఎందుకంటే ప్రతి సారి పరీక్షలకు ముందు, పేపర్లు కొందరికి ముందే చేరతాయి. ఆ విద్యార్థులు పరీక్షల్లో ముందు ఉంటారు. ఇది యువత నమ్మకానికి దెబ్బ అని రాహుల్‌ అన్నారు. ఇటీవలి నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ కేసు బీహార్‌ పేరు చెడగొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్‌ ముఖియాను ఈఏయూ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే అరారియా జిల్లా చెందిన ఎస్‌.కె. ఫైజ్‌ అనే వ్యక్తి టెలిగ్రామ్‌ ఛానల్‌ ద్వారా పేపర్లు లీక్‌ చేశాడని విచారణలో బయటపడింది.

మోదీపై మాటల బాణాలు

రాహుల్‌ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై మాటల దాడి చేశారు. మోదీకి ఓట్లు కావాలంటే ఏ నటనకైనా సిద్ధం. ప్రజలు అడిగితే వేదికపై నాట్యం చేస్తారు. ఎన్నికల కోసం ఆయన ఏ డ్రామానైనా పండిస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 200 ఓట్లు వస్తాయంటే ఎన్నికల ముందు మోడీ నటించడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత ఆయన అదానీ, అంబానీలతోనే ఉంటారు. వాళ్ల ఇంట్లో జరిగే వివాహాలకు ప్రధాని వెళతారు. కానీ రాహుల్ గాంధీ వెళ్లగా చూశారా? వారు ఎన్నుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, లక్షల రూపాయలు విలువ చేసే భూమిని ఒక రూపాయకే ధారవి భూమిని వాళ్లకే కేటాయించారు. బీహార్ లో కూడా అదానీకి అదే విధంగా అప్పజెప్పారు. అన్ని వారికోసమే చేశారు. పేద ప్రజలను పట్టించుకోరని గుర్తు చేశారు.

ఛత్ పూజ కోసం యమునా నదిలో స్నానం చేస్తానని ప్రధాని మోడీ అన్నారు. కానీ యమునా నదిలో మురికి నీరు ఉంది. ఎవరైనా దానిని తాగితే వారు అనారోగ్యానికి గురవుతారు లేదా చనిపోతారు. ఎవరూ లోపలికి వెళ్లలేరు. ఆ నీరు చాలా మురికిగా ఉంది, మీరు దానిలోకి ప్రవేశిస్తే, మీరు అనారోగ్యానికి గురవుతారు లేదా ఇన్ఫెక్షన్ బారిన పడతారు. కానీ మోడీ ఒక డ్రామా ఆడారు. బీజేపీ ప్రభుత్వం అక్కడ ఒక చిన్న చెరువు నిర్మించింది. ఎన్నికల కోసం వారు మీకు ఏదైనా చూపిస్తారు. వెనుక నుంచి పైపును ఏర్పాటు చేస్తారు. అందులో శుభ్రమైన నీటిని పోస్తారు. ఎవరో పైపు ఫోటో తీయడం వల్ల అసలు బండారం బయటపడిందని వివరించారు. ఫోటోలు,వీడియోలు బయటకు రావడంతో మోసం బట్టబయలైంది. దీంతో మోడీ వాసుదేవ్ ఘాట్ లో స్నానమాచరించడాన్ని విరమించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణకు ఆధారాలు ఉన్నట్టు ఢిల్లీ ఆప్‌ పార్టీ కూడా ఇటీవల ట్వీట్‌ చేసింది.

రేఖా గుప్తా ప్రభుత్వం, వాసుదేవ్‌ ఘాట్‌లో ఫేక్‌ యమునా సృష్టించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిందని ఆరోపిస్తూ ఆప్‌ నాయకులు ఆ పార్టీ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేసింది.

తేజస్వీ యాదవ్‌కు రాహుల్‌ ప్రశంసలు

తేజస్వీ యాదవ్‌ను రాహుల్‌ గాంధీ మహాఘట్బంధన్‌ సీఎం అభ్యర్థిగా ఎన్నికకావడంతో పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వర్గానికి గౌరవం ఇస్తుందన్నారు. పేదలు, వెనుకబడినవారు, అణగారిన వర్గాలు, మైనారిటీలు, అందరికీ సమాన హక్కులు కల్పిస్తుందన్నారు. బీహార్‌ను మళ్లీ అభివృద్ధి దిశగా నడిపించడమే మా లక్ష్యం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

రిజర్వేషన్లు పెంచుతాం: మహాఘట్బంధన్‌

మహాఘట్బంధన్‌ ఇప్పటికే విడుదల చేసిన ఎన్నికల ప్రకటన పత్రం(మేనిఫెస్టో)లో 50 శాతం రిజర్వేషన్‌ పరిమితిని దాటి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టం చేసింది.

రాహుల్‌ గాంధీ ఈసారి బీహార్‌ ఎన్నికల్లో ప్రధానంగా యువతను ఆకట్టుకునే అజెండాపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లు, అసమానతల వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు యువతలో చర్చనీయాంశమయ్యాయి.

ప్రధాని మోడీపై రాహుల్ విమర్శనాస్త్రాలు - Tholi Paluku